టీడీపీ నేతలకు అంత సంతోషమెందుకో: కొడాలి నాని

22 Aug, 2019 20:39 IST|Sakshi

పోలవరంపై హైకోర్టు తాత్కాలిక స్టే ఇచ్చింది..

సాక్షి, అమరావతి :  పోలవరంపై హైకోర్టు తాత్కాలికంగా స్టే ఇచ్చిందే కాని చంద్రబాబు నాయుడు చుట్టాలకు ఆ పనులు అప్పగించాలని చెప్పలేదని పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ‍్యానించారు. ఎవరైనా కోర్టుకు వెళితే స్టే ఇవ్వడం సహజమేనని, ఆ మాత్రం దానికే టీడీపీ నేతలు సంతోషపడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టు మారితే అంతకు ముందు నిర్మాణ సంస్ధల నుంచి తీసుకున్న డబ్బులు వెనక్కి ఇవ్వాల్సి వస్తుందనే భయం టీడీపీ నేతలకు పట్టుకుందని ఆరోపించారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ప్రభుత్వానికి డబ్బులు మిగులుతాయని చంద్రబాబు, దేవినేని ఉమా ఏడుస్తున్నారని ఆరోపించారు. 

గురువారం వెలగపూడి సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కొడాలి నాని టీడీపీపై తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. అవినీతి నిర్మూలనలో అనేక వత్తిడులు ఎదురవుతున్నాయని గతంలో ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. రివర్స్‌టెండరింగ్‌ ద్వారా ప్రజాధనాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నారని, సీఎం అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత పోలవరంపై న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పారు. 

రాజధానిపై అనవసర రాద్దాంతం 
రాజధానిపై మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు అనవర రాద్దాంతం చేస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని, రాజధానిని అమరావతి నుంచి తీసివేస్తామని ఆయన చెప్పలేదని స్పష్టం చేశారు. కృష్ణానదికి పెద్దగా వరదలు వచ్చినా, గట్టిగా వర్షాలు కురిసినా అమరావతి మునిగిపోతుందని ఆయన చెప్పారన్నారు. అందులోని లోపాలను గురించి బొత్స వివరించారని పేర్కొన్నారు.  ఇతర ప్రాంతాలతో పోల్చితే అమరావతిలో భవన నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతుందని ఆయన చెప్పారని తెలిపారు. రాజధాని నిర్మాణంపై జరిగిన అవినీతిపై సబ్‌ కమిటీ వేశామని, దోచుకున్న వాళ్లు అనుభవించక తప్పదని కొడాలి నాని స్పష్టం చేశారు. చంద్రబాబుకు ప్రజలు గూబ గుయ్యమనేలా తీర్పు ఇచ్చినా ఇంకా బుద్ధి రాలేదన్నారు. 

మరిన్ని వార్తలు