కాంట్రాక్టర్లతో కలసి ఎన్నికలను హైజాక్‌ చేసే కుట్ర

1 Oct, 2018 02:37 IST|Sakshi

పైసలతో మాయ చేసే ప్రయత్నాన్నితిప్పి కొట్టాలి: కోదండరాం 

హైదరాబాద్‌: కాంట్రాక్టర్లతో కలసి కొందరు ఎన్నికలను హైజాక్‌ చేసే కుట్ర చేస్తున్నారని, ఈ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. ఎవరో పంతులు చెప్పారని 9 నెలల ముందు అసెంబ్లీ రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కాన్‌స్టిట్యూషనల్‌ కన్‌క్లేవ్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో ‘సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ సాధన ప్రజా సంఘాల కర్తవ్యం’ అనే అంశంపై రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది.

కోదండరాం మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో పైసలతో మాయ చేయాలనే ప్రయత్నాన్ని దెబ్బకొట్టి స్పష్టమైన ఎజేండాతో ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికోట్లు పోసినా వారి ఆటలు సాగనివ్వవద్దని, ప్రజా సంఘాలే ఆ పని చేయగలుగుతాయని చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నడిపించింది ప్రజా సంఘాలేనని అన్నారు. తెలంగాణ వచ్చాక మంచి పాలన సాగుతుందని అనుకున్నామని, అయితే నియంతృత్వ ప్రభుత్వంతో ఘర్షణ పడాల్సి వచ్చిందన్నారు.

నియంతృత్వ అధికారాన్ని తిరుగుబాటు చేసింది ప్రజలు, ప్రజా సంఘాలేనని లేకుంటే ఇంకా నియంతృత్వం కొనసాగేదన్నారు. అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తూ ఉద్యమ ఆకాంక్షను దెబ్బతీసినప్పుడు ఒక పార్టీగా ముందుకు రావాల్సి వచ్చిందని చెప్పారు. పైసలు ఇచ్చేవారు కాదు పనిచేసే వారు రావాలని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు.

మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. టీఆర్‌ఎస్‌ నాలుగేళ్ల పాలనలో ప్రజాస్వామిక హక్కులు కాలరాయబడ్డాయన్నారు. కాన్‌స్టిట్యూషనల్‌ కన్‌క్లేవ్‌ హైదరాబాద్‌ అ«ధ్యక్షుడు డాక్టర్‌ చీమ శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బుద్ధా ప్రియ సిద్ధార్థ్, సామాజిక వేత్త సాంబశివరావు, ప్రొఫెసర్‌ అన్వర్‌ ఖాన్, పలు సంఘాల నేతలు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు