పదవీ విరమణ సభలా ఉంది

4 Sep, 2018 01:58 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ సభపై కోదండరాం

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రగతి నివేదన సభ.. పదవీవిరమణ సభలా సాగిందని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆర్భాటంగా ప్రకటించినా సభ వెలవెలబోయిందన్నారు. సభలో ప్రగతి నివేదన, భవిష్యత్‌ దర్శనం లేదని, కేసీఆర్‌ ప్రసంగం పేలవంగా సాగిందని వ్యాఖ్యానించారు. మైక్‌ టైసన్‌లా గెలుస్తారని అనుకుంటే మొదటి రౌండ్లో ఎలిమినేట్‌ అయినట్లుగా కేసీఆర్‌ పరిస్థితి ఉందన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో కోదండరాం మాట్లాడుతూ.. ‘సభకు 25 లక్షల మంది వస్తారని, ముఖ్య ప్రకటనలు చేస్తారని, ఏదో జరిగిపోతుందని అంతా అనుకున్నారు.

కానీ ప్రకటించిన దాంట్లో 4వ వంతు జనం కూడా రాలేదు’అన్నారు. సభ పూర్తిగా విఫలమైందని, అన్ని శక్తులు ఉపయోగించినా జనాన్ని సభకు తీసుకురాలేకపోయారన్నారు. సీఎం ప్రసంగంలో మాటల తడబాటు ఉందని, మాటలు వెతుక్కోవాల్సి వచ్చిందని.. ప్రజలతో సంబంధాలు లేకపోవడం వల్లే మాటలు రాలేదని విమర్శించారు. సభతో పార్టీ కార్యకర్తలకు భరోసా ఇవ్వలేకపోయారని చెప్పారు. అది బలప్రదర్శన, కేసీఆర్‌ గర్జన కాదని, ఆయన స్వీయ వేద నలా ఉందని ఎద్దేవా చేశారు. దీపం ఆరిపోయేముందు ఆఖరి తేజంలా కేసీఆర్‌ తీరు ఉందన్నారు. రాజకీయంగా, ప్రభుత్వపరంగా తన విధానం చెప్పుకోవడంలో కేసీఆర్‌ విఫలమయ్యారని విమర్శించారు.

త్వరలో ఇంటింటికీ జన సమితి
తెలంగాణ జనసమితిని బూత్‌ స్థాయికి తీసుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని కోదండరాం వెల్లడించారు. త్వరలోనే ఇంటింటికీ జన సమితి ప్రచారం మొదలెడతామన్నారు. హైదరాబాద్, జిల్లాల్లో అమరుల స్మృతి చిహ్నం కోసం ఈ నెల 12న ఒకరోజు దీక్ష చేస్తామని చెప్పారు. చేరికలతో కాకుండా సొంతగా పార్టీ శక్తి సామర్థ్యాలు పెంచుకుంటామన్నారు. పార్టీ ప్రచారం కోసం రెండు విడతులుగా బస్సుయాత్రలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా కరీంనగర్‌ జిల్లాకు చెందిన పలువురు మహిళలు టీజేఎస్‌లో చేరారు.

మరిన్ని వార్తలు