ఓటమి భయంతోనే పరుష పదజాలం’

8 Oct, 2018 01:14 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌లో అధికారం కోల్పోతున్నానన్న అసహనం పెరిగిందని, ఆయన్ని ఓటమి భయం వెంటాడుతోందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పేర్కొన్నారు. అందువల్లే కేసీఆర్‌ తన స్థాయిని మరిచి దిగజారి మాట్లాడుతున్నారన్నారు. ఇటీవల సభల్లో ఆయన వాడిన పరుష పదజాలం తీవ్ర ఆక్షేపణీయమని, పెద్ద మనిషి తరహాలో మాట్లాడటం లేద న్నారు. టీజేఎస్‌ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారం వ్యసనంగా మారిన వారికే ఇలాంటి పదజాలం వస్తుందన్నారు.  

ఉమ్మడిగానే ప్రచారం  
ఉద్యమ ఆకాంక్షలకు గౌరవం ఇచ్చే పార్టీలతోనే పొత్తు ఉంటుందని, ఆ భాగస్వామ్య పార్టీలతోనే ఉమ్మడిగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తామని కోదండరామ్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం సీట్ల పంపిణీ పై నాలుగైదు రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు. ప్రచారంలో భాగంగా ఈ నెల 14న మంచిర్యాల చెన్నూరులో, 15న నిర్మల్‌ జిల్లా మ«థోల్‌లో బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. ఓరుగల్లు పోరుసభ పేరుతో 23న వరంగల్‌లో భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. అనంతరం వరంగల్‌ సభ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.

తెలంగాణకు ఏం చేశారు?: తెలంగాణపై ప్రేమ ఉందని చెబుతున్న కేసీఆర్‌ అధి కారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఏంచేశారని కోదండరామ్‌ ప్రశ్నించారు. కాంట్రాక్టులన్నీ ఆంధ్రా వారికే ఇచ్చారని, ఉద్యోగాలు సరిగ్గా భర్తీ చేయలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్టర్ల ప్రయోజనాలే ఉన్నాయన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించి ఎన్నికల కమిషన్‌ తొందరపడిం దన్నారు. సమావేశం అనంతరం నిజాం పాలనలో ప్రధానిగా పని చేసిన మహారాజ కిషన్‌ ప్రసాద్‌ మనవడు రాజా సంజయ్‌ గోపాల్‌ టీజేఎస్‌లో చేరారు.  

మరిన్ని వార్తలు