తెలంగాణ వ్యతిరేక శక్తులకు సర్కార్‌ ఊతం

24 Jan, 2018 02:44 IST|Sakshi

టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం 

మంచిర్యాల క్రైం: తెలంగాణ వ్యతిరేక శక్తులకు ప్రభుత్వం ఊతమిస్తోందని, ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంచిర్యాల, కుమురం భీం జిల్లాల రైతు, నిరుద్యోగ సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పర్యటనపై పరోక్షంగా విమర్శలు చేశారు. రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన ఉద్యమకారులను పక్కనపెట్టి వ్యతిరేక శక్తులను రంగంలోకి దింపడం టీఆర్‌ఎస్‌ తీరుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో రైతాంగాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. కల్తీ విత్తనాలు, ఎరువులతో దిగుబడి రాక, మద్దతుధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెజారిటీ ప్రజల జీవనాధారమైన వ్యవసాయ రంగం అభివృద్ధే లక్ష్యంగా టీజేఏసీ ముందుకు సాగుతుందన్నారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగ యువతీయువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దిశలో రైతు, నిరుద్యోగ సమస్యలపై పూర్వపు 10 జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తుండగా, మొదటి సదస్సు మంచిర్యాలలో నిర్వహించినట్లు చెప్పారు. ఈనెలాఖరు వరకు సదస్సులు పూర్తి చేసి, ఫిబ్రవరి 4న హైదరాబాద్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.  

ప్రజాసంఘాల పాత్ర కీలకం 
సిద్దిపేట ఎడ్యుకేషన్‌: ప్రతి ఉద్యమంలో ప్రజాసంఘాల, పౌర సంఘాల పాత్ర కీలకమేనని కోదండరాం అన్నారు. మంగళవారం సిద్దిపేటలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల పౌర వేదికలను ప్రభుత్వం అడ్డుకొని ఆంక్షలు విధించడం సరికాదన్నారు. జేఏసీలో పార్టీలకు చోటు లేదని, ప్రజా సంఘాలకు మాత్రమే చోటు ఉంటుందన్నారు. బంగారు తెలంగాణ సాధన కోసం జేఏసీ మరో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందన్నారు.  

నీళ్లు అడిగితే నిషేధాజ్ఞలా.. 
పెద్దపల్లి: పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ప్రశ్నిస్తే నిషేధాజ్ఞలు విధించి ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కులను కాలరాస్తున్నారని జేఏసీ చైర్మన్‌ కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పెద్దపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పంటలకు కావాల్సిన నీటిని అందించాలని రైతులు ఎక్కడ నిలదీస్తారోననే భయంతో జిల్లాలో 144 సెక్షన్, 30 యాక్ట్‌లను అమలు చేస్తున్నారన్నారు. దొమ్మీలు, రక్తపాతం జరిగినపుడు మాత్రమే ఇలాంటి చట్టాలు ప్రయోగిస్తారన్నారు.  

మరిన్ని వార్తలు