నిరంకుశ పాలనపై ప్రజా తీర్పు

25 May, 2019 01:14 IST|Sakshi

టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం 

సాక్షిప్రతినిధి, సూర్యాపేట: ఇష్టానుసారంగా.. తాము ఏం చేసినా.. ప్రజలు ఆమోదిస్తారన్న పాలకుల నిరంకుశ వైఖరిపై ప్రజలు ఈ ఎన్నికల్లో ఓటుతో తీర్పునిచ్చారని, ప్రజా ఉద్యమాలను అణచాలని చూస్తే ఎంతటి వారికైనా పతనం తప్పదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. శుక్రవారం ఆయన సూర్యాపేట జిల్లాకేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ, ఈ లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మూల స్తంభాలైన కరీంనగర్, నిజామాబాద్‌ నేతలు ఓడిపోయారన్నారు. ఈ ప్రభుత్వం గెలిచాక నిరుద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయని, ప్రజా ఉద్యమాలను అణచాలని ప్రభుత్వం చూడడంతో నాలుగు నెలలకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని విమర్శించారు.

మంత్రివర్గ ఏర్పాటులో ఆలస్యం, పాలన లేకపోవడం, ఏ విషయాన్ని అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ప్రజలపై నిర్లక్ష్య ధోరణితో టీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో రైతులు సంఘటిత శక్తిగా నిలబడి జాతీయస్థాయికి రైతాంగ సమస్యలను తీసుకెళ్లారని తెలిపారు. త్వరలోనే తెలంగాణ జనసమితి అటవీ భూముల హక్కుపై పోరాటాన్ని ఉధృతం చేస్తుందన్నారు. ప్రజలు మాత్రం గట్టిగా నిలబడి ప్రభుత్వానికి బుద్ధి చెప్పారన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు వెంకట్‌రెడ్డి, కుంట్ల ధర్మార్జున్, గట్ల రమాశంకర్‌ తదితరులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు