పాలన చేతగాకే ముందస్తుకు

1 Jul, 2018 02:59 IST|Sakshi

సీఎం కేసీఆర్‌పై కోదండరాం ఫైర్‌

అయినా తాము సిద్ధమేనని స్పష్టీకరణ

టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమే

ఉపాధ్యాయ బదిలీల్లో భారీ అక్రమాలు

వాటిపై న్యాయ విచారణ జరిపించాలి

డీలర్లకు గౌరవ వేతనం ఇవ్వాల్సిందే

రైతు సమస్యలపై ఇక పోరాటాలేనని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: పాలన చేతగాకే ముందస్తు ఎన్నికలకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సిద్ధమవు తున్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం విమర్శించారు. ఐదేళ్లు పాలిం చమని ప్రజలు అధికారమిస్తే సమస్యలతో గందర గోళ పరిస్థితులు సృష్టించారని, అందుకే ముందస్తుకు వెళ్తున్నారని దుయ్యబట్టారు. అయినా ఎన్నికలకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనన్నారు.

శనివారం టీజేఎస్‌ కార్యాలయంలో కోదండరాం మాట్లాడుతూ.. టీచర్ల బదిలీల్లో కౌన్సెలింగ్‌ వ్యవస్థకు తూట్లు పొడిచి అక్రమాలకు పాల్పడుతున్నారని, ఒక్కో పోస్టుకు రూ. 2.5 లక్షల వరకు తీసుకుంటున్నారని ఆరోపిం చారు. పోస్టులను దాచి తమకు నచ్చినవారికి ఇవ్వా లని చూస్తున్నారని, ఈ వ్యవహారంలో మంత్రులు కూడా ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. దీనిపై సిట్టింగ్‌ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

రేషన్‌ డీలర్లకు కేంద్రం ఇచ్చే కమీషన్‌ కూడా ఇవ్వడం లేదని కోదండరాం విమ ర్శించారు. అదీగాక షాపులను మహిళా సంఘాలకు ఇస్తామనడం, డీలర్లపై కేసులు పెడతామని బెదిరించడం సరికాదన్నారు. అందుకే గజ్వేల్‌లో ఓ డీలర్‌ ఆత్మహత్యాయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. డీలర్లకు గౌరవంగా బతికే అవకాశం కల్పిం చాలని, గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

కూలీలుగా మార్చేశారు
రైతుబంధు సాయం అన్ని గ్రామాల్లో అందలేదని, భూ రికార్డులన్నీ తప్పుల తడకగా ఉన్నాయని కోదండరాం మండిపడ్డారు. 15 రోజుల పాటు 120 గ్రామాల్లోని 3,500 మంది రైతులను కలసి అభిప్రాయాలు సేకరించామని.. 40 శాతం రైతులకు కూడా సహకారం అందడం లేదని చెప్పారు. వికారాబాద్‌ జిల్లా కన్కాల్‌లో ఎక్కువ మంది రైతులకు రైతుబంధు సాయం అందలేదని, కొత్త పాసు పుస్తకాలూ రాలేదని, వచ్చినవి కూడా తప్పుల తడకగా ఉన్నాయన్నారు.

మెదక్‌ జిల్లా నర్సంపల్లి సహా కొన్ని ప్రాంతాల్లో అనేక సంవత్సరాలుగా భూమిని నమ్ముకొని బతుకుతున్న వారికి భూమిపై హక్కు లేదని చెప్పి కూలీలుగా మార్చారని నిప్పులు చెరిగారు. అటవీ భూములు, డబ్బు పెట్టి కొనుక్కున్న భూములపై హక్కు లేదంటూ ఒక్క పెన్ను పోటుతో అనేక మందిని కూలీలుగా మార్చేశారని దుయ్యబట్టారు. భూముల కోసం పోరాడే వారిని అక్రమంగా అదుపులోకి తీసుకొని బెదిరిస్తున్నారని ఆరోపించారు.


కౌలు రైతులపై విషం...
భూ రికార్డుల ప్రక్షాళన తరువాత అనేక మంది చిన్న రైతులు ఇంటి పనులకు పోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, దీనికి కారణం కేసీఆరేనని కోదండరాం విమర్శించారు. కౌలు రైతులపై విషం కక్కుతున్నారని, భూమి దున్నుకోడానికి సాయం అడిగితే విరుచుకుపడుతున్నారని మండిపడ్డారు. చిన్న, కౌలు రైతుల పక్షాన జన సమితి పోరాటం చేస్తుందని వెల్లడించారు.

ప్రమాదంలో చనిపో యిన వారి కుటుంబాలను ఆదుకోమంటే, రూ.50 లక్షలు పరిహారం ఇవ్వమని అడుగుతారా అంటూ హేళన చేయడం దురదృష్టకరమన్నారు. దశల వారీగా సమితి పోరాటం ఉధృతం చేస్తామని కోదండరాం వెల్లడించారు. భూ రికార్డుల లోపాలపై గవర్నర్‌కు నివేదిక ఇస్తామని చెప్పారు. అన్ని పక్షాలను కలుపుకొని కార్యాచరణ రూపొందిస్తామన్నారు. సమావేశంలో టీజేఎస్‌ నేతలు కనకయ్య, విశ్వేశ్వర్‌రావు, వెంకట్‌రెడ్డి, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు