పరువు తీసుకుంటున్న ప్రభుత్వం

12 Apr, 2018 01:21 IST|Sakshi

టీజేఎస్‌ అంటే అంత భయమెందుకు?: కోదండరాం

అసలు ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా..?

ఎవరికీ ఇబ్బంది లేకున్నా సభకు అడ్డంకులు

పోలీసుల చిత్ర, విచిత్ర కారణాలతో విస్తుపోతున్నాం

సినిమా ఫంక్షనప్పుడు సమస్యలు గుర్తు రాలేదా అని ప్రశ్న

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాస్వామిక సభలు, శాంతియుత నిరసనలపై ఇష్టమొచ్చినట్లు ఆంక్షలు విధించడంతో ప్రభుత్వం తన పరువు తానే తీసుకుంటోందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వ నిర్బంధాన్ని చూస్తుంటే ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా అన్న సందేహం కలుగుతోందని బుధవారం మీడియాతో పేర్కొన్నారు.

ప్రభుత్వాలు జవాబుదారీతనం గా ఉండాలని, రాజ్యాంగానికి, చట్టానికి లోబడి పాలన జరగాలని హితవు పలికారు. రాజ్యాంగంలోని 19వ అధికరణ ప్రకారం దేశంలోని ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులు ఉన్నాయని, ఏవైనా సమస్యలు ఉత్పన్నమవుతాయని భావిస్తేనే ఆంక్షలు పెట్టొచ్చని చెప్పారు. ఎవరికీ, ఎలాంటి ఇబ్బంది లేకున్నా తమ సభలకు, నిరసనలకు ప్రభుత్వం అడ్డంకులు కల్పిస్తోందని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు.  

వింత కారణాలు చెబుతున్న పోలీసులు
అధికారంలో ఉన్న వారికి ఇది ప్రజాస్వామ్య దేశమని పదేపదే గుర్తుచేయాల్సి వస్తున్నందుకు సిగ్గుగా ఉందని కోదండరాం వ్యాఖ్యానించారు. దేశంలో అన్ని వర్గాల ప్రజల హక్కులను కాపాడాల్సిన బాధ్యత, అభిప్రాయాలు వెల్లడించే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. జనసమితి సభను హైదరాబాద్‌లో నిర్వహించుకునేందుకు 7 ప్రాంతాలను గుర్తించి, అనుమతి కోసం దరఖాస్తు చేసినట్లు తెలిపారు.

పోలీసు శాఖ చిత్ర, విచిత్రమైన కారణాలను చూపిస్తూ సభకు అనుమతిని నిరాకరిస్తోం దని ఎద్దేవా చేశారు. వాహనాల రద్దీ పెరిగి, ట్రాఫిక్‌ ఆగిపోయి, వాయు కాలుష్యం పెరిగి, ప్రజలకు ఊపిరితిత్తుల సమస్య వస్తుందంటూ పోలీసుల సమాధానాలకు విస్తుపోయామని చెప్పారు. జన సమితి సభకోసం అడిగిన మైదానంలోనే ఇటీవలే ఓ సినిమాకు సంబంధించి ఫంక్షన్‌కు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు. పర్యావరణానికి అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు మాత్రం ఎలా వస్తుందని దుయ్యబట్టారు.  

మేమంటేనే సమస్యలు గుర్తొస్తాయా?
తెలంగాణ జేఏసీ ఏ కార్యక్రమం నిర్వహించినా, జన సమితి సభలు పెట్టుకున్నా పోలీసులకు ఎన్నో సమస్యలు గుర్తుకొస్తున్నాయని కోదండరాం విమర్శించారు. కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సభ ఇక్కడే పెట్టుకోవాలని ప్రభుత్వం నిర్బంధంగా చెప్పడం అప్రజాస్వామికమని, ఇలాంటి అప్రజాస్వామిక ధోరణిని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. జనసమితి అంటే ప్రభుత్వానికి భయం పట్టుకుందని చెప్పారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు, నిర్బంధాలతో గెలుస్తామని అధికారంలో ఉన్నవారు అనుకుంటే పొరపాటేనని వ్యాఖ్యానించారు.

వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు వస్తాయని బయటకు చెప్పుకుంటున్నా ఓడిపోతామనే భయం టీఆర్‌ఎస్‌కు పట్టుకుందన్నారు. జనసమితి సభ ద్వారా ప్రభుత్వం అనుసరిస్తున్న విధివిధానాలను, ప్రజలకు జరుగుతున్న నష్టాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తామనే భయంతోనే అనుమతి ఇవ్వట్లేదని పేర్కొన్నారు. ఎన్నో త్యాగాలు, ఎందరో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అధికారం ఒకే కుటుంబానికే పరిమితం కావడం బాధ కలిగిస్తోందన్నారు. ముఖ్యమంత్రిగా ఎవరున్నా అందరినీ సమానంగా చూడాలని, ఆ కుర్చీకి ఉన్న హోదాతో బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. 

మరిన్ని వార్తలు