కోడెల అడ‍్డంగా దొరికిపోయిన దొంగ: అంబటి

23 Aug, 2019 17:19 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: మాజీ స్పీకర్‌, టీడీపీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాదరావు ఆరోపణలను ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు. తానేదో కుట్ర చేసినట్లు అవాస్తవాలు మాట్లాడటం సరికాదని, కోడెలే పెద్ద గజదొంగ అని ఆయన విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం  అంబటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు.  కోడెల ఇంట్లో దొంగతనం జరిగితే తానే చేయించానని దుష్ర్పచారం జరుగుతుందని... పెద్ద దొంగతనం కప్పిపుచ్చుకునేందుకు చిన్న దొంగతనం డ్రామాను తెరపైకి తెచ్చారన్నారు. కోడెల చెబుతున్న అర్జున్‌ అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని, తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆరా తీస్తే అతడు మున్సిపల్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా తేలిందన్నారు.  చోరీ చేసిన సొత్తును తిరిగి ఇచ్చినంత మాత్రాన నేరం కాకుండా పోదని, కోడెల శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు. 

ఈ ఘటనపై విచారణ జరుగుతుందని, త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు. ఎవరు దొంగలో తేలిపోతారని హెచ్చరించారు. కోడెల శివప్రసాద్‌ దొరికిపోయిన దొంగ అన్నారు. తాను చిత్తశుద్ధితో ఉన్నానని, దొంగతనాలు చేయించడానికి సిద్ధంగా లేనని పేర్కొన్నారు. కోడెలకు సంబంధించిన హీరో హోండా షోరూమ్‌ను ఆ కంపెనీ సీజ్‌ చేసిందని, అక్కడ అసెంబ్లీ ఫర్నీచర్‌ ఉందని అధికారులు గుర్తించినట్లు తెలిపారు. షోరూమ్‌ తన క్యాంపు ఆఫీస్‌ అని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. 

ఫర్నిచర్‌ దొంగతనం చేసి కోడెల కార్యాలయంలో దాచుకున్నారని, అసెంబ్లీకి సంబంధించిన 30 కంప్యూటర్లు కోడెల శివప్రసాదరావు కొడుకు, కూతురు కలిసి అమ్ముకున్నారన్న ప్రచారం తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయంపై స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అధికారికి ఈ నెల 9వ తేదీన ఫిర్యాదు చేశానని చెప్పారు. దీనిపై తక్షణమే విచారణ జరిపించాలని లేఖ రాసినట్లు చెప్పారు. దొంగతనం కోడెల ప్రమేయంతోనే జరిగిందన్నారు. తానేదో కుట్ర చేసి దొంగతనం చేయించినట్లు దుష్ర్పచారం జరుగుతుందన్నారు. ఇది ఒక కంప్యూటర్‌ కొత్త కుంభకోణమని అభివర్ణించారు.

కోడెల సరికొత్త డ్రామా...
కాగా సత్తెనపల్లిలోని కోడెల శివప్రసాదరావు నివాసంలో కంప్యూటర్ల చోరీతో డ్రామా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కోడెల ఇంట్లో చోరికి గురైనట్టుగా చెబుతున్న కంప్యూటర్లు ప్రభుత్వానివి. విద్యార్థుల శిక్షణకు ఉపయోగించాల్సిన వీటిని సత్తెనపల్లి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ నుంచి గతంలో తన ఇంటికి తెప్పించుకున్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ నుంచి కంప్యూటర్లు మాయమైన విషయాన్ని ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీ నాయకుడు అంబటి రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసుల విచారణ వేగవంతం కావడంతో చోరీ నాటకానికి కోడెల తెర తీశారు.

శుక్రవారం ఉదయం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సిబ్బంది కోడెల నివాసం నుంచి కంప్యూటర్లను తీసుకెళ్లారు. అనంతరం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి... ఎమ్మెల్యే అంబటి రాంబాబు దగ్గరికి వెళ్లి  పోయిన కంప్యూటర్లు దొరికాయని చెప్పగా.... ‘నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీరెందుకు కంపూటర్లు స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొత్తును రికవరీ చేయాల్సింది పోలీసులు కదా’ అని అంబటి ప్రశ్నించగా సదరు అధికారి జవాబు చెప్పలేకపోయారు. దీంతో ఇదంతా కోడెల శివప్రసాదరావు ఆడించిన నాటకమని పక్కాగా తేలిపోయింది.

మరిన్ని వార్తలు