‘కోడెల’ తనయుడి వీరంగం

19 Sep, 2018 04:34 IST|Sakshi
పోలీసుస్టేషన్‌ వద్ద గుమికూడిన టీడీపీ వర్గీయులు

తమ వర్గీయుడిని పంపాలంటూ పోలీస్‌స్టేషన్‌లో హడావుడి 

వీడియో చిత్రీకరిస్తున్న కానిస్టేబుల్‌పై ఆగ్రహం 

స్టేషన్‌ను ముట్టడించిన టీడీపీ శ్రేణులు..

నరసరావుపేట: రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామకృష్ణ పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. తమ వర్గీయులను విడిచిపెట్టాలంటూ పోలీసుస్టేషన్‌లో హడావుడి చేశారు. మీకెంత ధైర్యం ఉంటే మా మనిషిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొస్తారంటూ పోలీసులపై దూషణలకు దిగారు.

గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలోని ఎడ్వర్డుపేటలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. వినాయకుని నిమజ్జనం సందర్భంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై జరిగిన దాడి విషయంలో ఆ గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్‌ కొలికొండ కొండలును పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న మండల టీడీపీ నాయకులు మంగళవారం సాయంత్రం స్టేషన్‌కు చేరుకుని తమ నాయకుడిని వెంటనే విడుదల చేయాలంటూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇదే సమయంలో నరసరావుపేట నుంచి స్పీకర్‌ కోడెల తనయుడు శివరామకృష్ణ రొంపిచర్ల పోలీసుస్టేషన్‌కు వస్తూనే పోలీసులపై విరుచుకుపడ్డారు. డీఎస్పీ కె. నాగేశ్వరరావు కూడా అప్పుడే వచ్చారు. శివరామకృష్ణకు డీఎస్పీ మధ్యæ వాగ్వాదం జరిగింది. పోలీసులపై శివరామకృష్ణ గొడవకు దిగడంతో మండల టీడీపీ నేతలు మరింతగా రెచ్చిపోయి పోలీసులను తిడుతూ దౌర్జన్యం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇదే సమయంలో టీడీపీ నేతల దౌర్జన్యాన్ని వీడియో తీస్తున్న ఓ కానిస్టేబుల్‌ను కోడెల శివరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కెమెరాను లాక్కునే ప్రయత్నం చేశారు.

అరెస్టయిన వ్యక్తిని తన వెంట పంపాల్సిందేనంటూ శివరామకృష్ణ పట్టుబట్టారు. ఒక దశలో టీడీపీ నేతలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో డీఎస్పీ నాగేశ్వరరావు శివరామకృష్ణతో చర్చలు జరపగా రెండు గంటల అనంతరం ఆయన అక్కడి నుంచి తిరిగి వెళ్లారు. కొలికొండ కొండలును వదిలేస్తామని హామీ ఇచ్చిన మేరకే కోడెల శివరామకృష్ణ స్టేషన్‌ నుంచి వెళ్లినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు