స్పీకర్‌కు అసమ్మతి సెగ

13 Mar, 2019 14:04 IST|Sakshi

సాక్షి, గుంటూరు: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార టీడీపీలో అసమ్మతి పెరుగుతోంది. సీనియర్‌ నాయకులపై తీవ్రస్థాయిలో అసమ్మతి వ్యక్తమవుతోంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమైన శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుకూ అసమ్మతి సెగ తప్పలేదు. ఆయనకు టిక్కెట్‌ ఇవ్వొద్దంటూ ఏకంగా సత్తెనపల్లి టీడీపీ కార్యాలయంలోనే అసమ్మతి నాయకులు బుధవారం సమావేశమయ్యారు. కోడెల వద్దు అన్న నినాదాలతో పార్టీ కార్యాలయం మార్మోగింది. కోడెలకు వ్యతిరేకంగా వ్యూహరచన చేసే పనిలో మునిగిపోయారు అసమ్మతి నాయకులు. ఈ సమావేశానికి భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు హాజరుకావడం కోడెల వర్గాన్ని కలవరపెడుతోంది.

నరసరావుపేట ఎంపీగా కోడెలను పోటీ చేయించాలని టీడీపీ నాయకత్వం భావిస్తున్న నేపథ్యంలో అసమ్మతి సెగ ఆయనకు తలనొప్పిగా మారింది. ఎంపీగా పోటీ చేసేందుకు ఆయన సుముఖంగా లేరు. మరోవైపు తన కుమారుడికి నరసరావుపేట టిక్కెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు. కోడెలకు సత్తెనపల్లి టిక్కెట్‌ విషయంలో చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై టీడీపీలో ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని వార్తలు