పార్టీకి కొమ్ముకాస్తే ఇదేనా మర్యాద!

13 Mar, 2019 02:39 IST|Sakshi

స్పీకర్‌ కోడెలకు టిక్కెట్‌ సంగతి తేల్చకపోవడంపై ఆయన అనుచరుల ఆగ్రహం  

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటువేయకుండా టీడీపీకి మేలు చేసినా గుర్తించరా? 

సభలో ప్రతిపక్షం గొంతునొక్కి ప్రభుత్వాన్ని కాపాడినందుకు ఫలితం ఇదా? 

సాక్షి, అమరావతి: శాసనసభాపతి స్థానంలో ఉండి అనేక అంశాల్లో రాజ్యాంగబద్ధంగా చేపట్టాల్సిన చర్యలు తీసుకోకుండా పార్టీకి మేలు చేస్తే చివరకు మా నాయకుడికి ఇచ్చే మర్యాద ఇదేనా? అని అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు వర్గీయులు టీడీపీ అధిష్టానంపై మండిపడుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కోడెలకు టిక్కెట్‌ విషయంలో ఎటూ తేల్చకుండా సందిగ్ధంలో పడేసిన సంగతి తెలిసిందే. పార్టీ అధినేత చంద్రబాబు వేర్వేరు ప్రతిపాదనలను తెరపైకి తెస్తుండడంతో స్పీకర్‌ అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. తమ నేతకు పార్టీ టిక్కెట్‌ వస్తుందో రాదోనని స్పీకర్‌ అనుచరవర్గం ఆందోళన  చెందుతోంది.  గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి కోడెల శివప్రసాదరావు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. స్పీకర్‌గా పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన ఆయన గతంలో ఏ సభాపతి వ్యవహరించని రీతిలో పలు వివాదాస్పద నిర్ణయాలతో విమర్శల పాలయ్యారు. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా వివాదాస్పద స్పీకర్‌గా అప్రతిష్ట మూటగట్టుకున్నారు. ఒక స్పీకర్‌గా పార్టీలకు అతీతంగా ఉండాల్సిన కోడెల తెలుగుదేశం పార్టీ క్రియాశీలక కార్యకర్తగానే వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి.

ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే సభను నడిపించారని సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు ప్రలోభాలకు గురిచేసి, రూ.కోట్ల కొద్దీ డబ్బులు వెదజల్లి తమ పార్టీలోకి ఫిరాయించేలా చేసినా స్పీకర్‌ పట్టించుకోలేదు. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద  వీరిని అనర్హులుగా ప్రకటించాలని సాక్ష్యాధారాలతో సహా వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసినా కోడెల లెక్కచేయలేదు. ఫిరాయింపుదార్లపై స్పీకర్‌ త్వరితంగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు, సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలిచ్చినా ఆయన లక్ష్యపెట్టలేదు. పైగా వారికి సభలో టీడీపీ వైపు స్థానాలను కేటాయించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేస్తే, ఉప ఎన్నికలు వచ్చి తెలుగుదేశం పార్టీకి నష్టం వాటిల్లుతుందన్న చంద్రబాబు సూచనలతోనే స్పీకర్‌ వారి జోలికి వెళ్లలేదు. అంతేకాకుండా అసెంబ్లీలో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్న విమర్శలు కోడెలపై వెల్లువెత్తాయి. ప్రభుత్వానికి ఇబ్బంది ఎదురయ్యే ప్రతి సందర్భంలోనూ ప్రతిపక్షంపై ఎదురుదాడి చేసేలా అధికార పార్టీ సభ్యులను లేపి మాట్లాడించేవారన్న విమర్శలున్నాయి. ఇంత మేలు చేసిన కోడెలకు టిక్కెట్‌ విషయంలో మీనమేషాలు లెక్కించడం ఎంతవరకు సబబని ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఏ స్పీకరూ చేయని విధంగా పార్టీ సమావేశాల్లో పాల్గొన్న కోడెలకు అన్యాయం చేస్తే సహించబోమటున్నారు. 

సత్తెనపల్లా.. నరసారావుపేట.. ఎంపీ సీటా? 
కోడెల టిక్కెట్‌ విషయంలో టీడీపీ అధిష్టానం తర్జనభర్జన పడుతోంది. కోడెలతోపాటు ఆయన కుటుంబంపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో టిక్కెట్‌ విషయంలో పార్టీ నాయకత్వం తేల్చలేకపోతున్నట్లు టీడీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సత్తెనపల్లి నుంచి మళ్లీ పోటీ చేస్తానని కోడెల ప్రకటించారు. తన కుమారుడికి నరసరావుపేట టిక్కెట్‌ ఇవ్వాలని కోరారు. అయితే ఈ రెండింటిపైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తెరపైకి కొత్తకొత్త పేర్లను తెస్తుండడంతో కోడెల వర్గం విస్తుపోతోంది. నరసరావుపేట ఎంపీగా కోడెలను పోటీ చేయించాలని టీడీపీ నాయకత్వం కసరత్తు చేపట్టింది. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా