చంద్రబాబూ... అలా ఎలా చెప్పారు?

18 Apr, 2019 12:18 IST|Sakshi

సాక్షి, విజయనగరం: ఎన్నికల ముందు నుంచే చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని వైఎస్సార్‌సీపీ నేత, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల సం‍ఘంపై బెదిరింపులకు పాల్పడిన బాబు.. అవేవీ ఫలితం ఇవ్వకపోవడంతో ఎన్నికల అనంతరం ఈవీఎంల పనితీరుపై విమర్శలు చేస్తూ ప్రజలకు ఈసీపై తప్పుడు సంకేతాలు పంపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, వాటిని హుందాగా స్వీకరించాల్సింది పోయి ఎన్నికల వ్యవస్థను తప్పుపట్టడం సరికాదన్నారు.

‘సైకిల్ గుర్తుకు ఓటేస్తే ఫ్యాన్ గుర్తుకే పోతుందన్న మీరు.. నిన్నా ఇవాళ టీడీపీకి 130 సీట్లు వస్తాయని ఎలా చెప్పగలుగుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత.. మీ ఓటమి నిశ్చయమై జైలుకు పోవాల్సి వస్తే కాపాడుకునేందుకే కేంద్రంలో వివిధ పార్టీలతో ఇప్పుడు కలుస్తున్నారా? మీరిచ్చిన హామీలను గుర్తు చేసుకునే ప్రజలు ఓటేశారు. మీరు చేసిన నమ్మకద్రోహాన్ని గుర్తుంచుకుని మరీ ఓటేశార’ని వీరభద్రస్వామి అన్నారు.

విజయనగరంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. ఏప్రిల్ మొదట్లోనే విజయనగరం పట్టణంలో తీవ్ర మంచినీటి ఎద్దడి తలెత్తిందని, ఇలాగే కొనసాగితే రానున్న మే, జూన్ నెలల్లో తలెత్తబోయే నీటి సమస్యను ఎదుర్కొనేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కోరారు. (చదవండి: ఎండల్లో తిరిగి మైండ్‌ పోయిందా?)

మరిన్ని వార్తలు