టీఆర్‌ఎస్‌కు షాక్‌ ఇచ్చిన జూపల్లి కృష్ణారావు!

17 Jan, 2020 11:40 IST|Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: ప్రతిష్టాత్మకంగా మారిన మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు సొంత నేతల నుంచే అసమ్మతి సెగ తప్పడం లేదు. పలుచోట్ల రెబెల్‌ అభ్యర్థులు గులాబీ శ్రేణుల్లో గుబులు రేపుతుండగా.. కొల్లాపూర్‌ మున్సిపాలిటీలో ఏకంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రెబెల్స్‌ తరఫున ప్రచారానికి దిగుతుండటంతో కారులో కలకలం రేపుతోంది. కొల్లాపూర్‌ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి వర్గీయులు బీ ఫామ్‌తో పోటీ చేస్తుండగా.. తన వర్గీయులకు ప్రాధాన్యం దక్కకపోవడంతో నేరుగా మాజీ మంత్రి కృష్ణారావు రంగంలోకి దిగారు. దాదాపు 20 వార్డుల్లో ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి తన అనుచరులను బరిలో నిలిపారు. దీంతో హర్షవర్ధన్‌రెడ్డి, జూపల్లి వర్గీయుల మధ్య ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. మొత్తానికి ఇక్కడ ఇంటిపోరు రచ్చకెక్కడంతో కొల్లాపూర్‌ రాజకీయం రసవత్తరంగా మారింది.

సీనియర్‌ నేత జూపల్లి ఏకంగా రెబల్స్‌కు అండగా నిలిచి.. పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండటంతో గులాబీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. మున్సిపల్‌ ఎన్నికలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈ అంశాన్ని ఆరా తీసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కొల్లాపూర్‌లో అంతర్గత విభేదాలను పరిష్కరించేందుకు త్వరలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అక్కడికి వెళ్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కొల్లాపూర్‌లోని పరిస్థితులను టీఆర్‌ఎస్‌ అధిష్టానం సీరియస్‌గా తీసుకొని.. ఇక్కడ పార్టీ గెలుపు కోసం ప్రతిష్టాత్మకంగా పనిచేయాలని పార్టీ నేతలను ఆదేశించినట్టు తెలుస్తోంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా