న్యాయం దక్కకపోతే ఆమరణ దీక్ష

25 May, 2018 03:11 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న కోమటిరెడ్డి, సంపత్‌

ఎమ్మెల్యేల హక్కుల్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హరిస్తోంది

డీజీపీని కలిసిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌ కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌ : తమపై అధికార పార్టీ, సీఎం కేసీఆర్‌ కక్షకట్టి హక్కులను హరిస్తున్నారని ఎమ్మెల్యే లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌ ఆరోపించారు. తమను ఎమ్మెల్యేలుగా కొనసాగిస్తూ హైకోర్టు తీర్పునిచ్చినా గన్‌మెన్‌ను కేటాయించకుండా వేధిస్తున్నారంటూ మండిపడ్డారు. తమ నియోజకవర్గాల్లోని కాంగ్రెస్‌ కార్యకర్తలపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, దీనిపై డీజీపీ మహేందర్‌రెడ్డిని కలసి వినతి పత్రం అందించామన్నారు. గురువారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కోర్టు తమను ఎమ్మెల్యేలుగా కొనసాగిస్తూ ఇచ్చిన తీర్పుపై సంబరాలు చేసుకున్న కాంగ్రెస్‌ కార్యకర్తలపై కేసులు పెట్టారన్నారు. తీర్పు వచ్చి 20 రోజులైనా తమకు గన్‌మెన్‌ను కేటాయించకపోవడం దారుణమన్నారు.

పదవుల్లేని టీఆర్‌ఎస్‌ నేతలకు గన్‌మెన్‌ను ఇస్తున్నారని.. ఎమ్మెల్యేలమైన మాకు గన్‌మెన్‌ను అడిగితే సెక్యూరిటీ రివ్యూ కమిటీకి సూచి స్తామని డీజీపీ చెప్పడం హాస్యాస్పదమన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం హత్యకేసుల్లో నిందితులని, వారిపై పోరాటం చేస్తున్న తనకు ఏమైనా జరిగితే ప్రభుత్వం పడిపోతుందని అన్నారు. న్యాయం దక్కకపోతే డీజీపీ, సీఎస్, అసెంబ్లీ సెక్రటరీలపై కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని కోమటిరెడ్డి హెచ్చరించారు. అక్రమ కేసులు ఆపకపోతే ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు. ఎమ్మెల్యే సంపత్‌ మాట్లాడుతూ కోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించాలని డీజీపీని కోరామన్నారు.  సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు తమ గొంతు నులిమే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.  

మరిన్ని వార్తలు