రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

15 Jun, 2019 19:34 IST|Sakshi

టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే

టీడీపీతో పొత్తు కారణంగానే కాంగ్రెస్‌ నష్టపోయింది: రాజ్‌గోపాల్‌

సాక్షి, నల్గొండ: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో ఎందుకు పోత్తు పెట్టుకున్నారని, ఎవరిని సంప్రదించి పొత్తు కుదుర్చుకున్నారని ప్రశ్నించారు. టీడీపీతో పొత్తు కారణంగానే కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని అన్నారు. పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే లు టీఆర్‌ఎస్‌లోకి వెళ్తే రాష్ట్ర నాయకత్వం కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండలో శనివారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వం బలహీనపడిందని నాయకులు భావిస్తున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. కార్యకర్తలతో పాటు ప్రజలంతా కూడా బీజేపీ వైపే చూస్తున్నారని రాజ్‌గోపాల్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.  ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. కాగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు బీజేపీలో చేరేందుకు ఆ పార్టీ అధిష్టానంతో రహస్య మంతనాలు జరిపినట్టుగా ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన వ్యాఖ్యలతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌కు ఉన్న ఏకైక ఎమ్మెల్యే పార్టీని వీడుతారనే వార్తలు వ్యక్తమతున్నాయి. 

కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిలతో పాటు మాజీ ఎంపీ వివేక్‌, కేసీఆర్‌ అన్న కూతురు కల్వకుంట్ల రమ్య రావు బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌తో భేటీ అయినట్టు ఢిల్లీ వర్గాల సమాచారం. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీలు బీజేపీలో చేరతున్నట్టుగా ప్రచారం జరుగుతున్నటప్పటికీ.. నేతలు ఆ వార్తలను ఖండిస్తూ వచ్చారు. అయితే తాజా పరిణామాలు ఆ వార్తలకు  మరింత బలం చేకూర్చేలా ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి కోలుకునే అవకాశం లేకపోవడంతోనే పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు టీ టీడీపీకి చెందిన పలువురు నేతలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టుగా సమాచారం.

మరిన్ని వార్తలు