‘25 మందికి నేనే టికెట్లు ఇప్పించా’

19 Nov, 2018 02:11 IST|Sakshi

చౌటుప్పల్‌: రాష్ట్ర వ్యాప్తంగా 25 మందికి టికెట్‌లు ఇప్పించానని ఎమ్మెల్సీ, మునుగోడు కాంగ్రెస్‌ అసెంబ్లీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండల పరిధిలోని లక్కారంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 10 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక సరిగా లేదని, ఆయా స్థానాల్లో మార్పులు చేర్పులు జరుగుతాయని చెప్పారు.

ఇందుకోసం ఇప్పటికే ఢిల్లీలోని పెద్దలతో సంప్రదింపులు చేస్తున్నానని తెలిపారు. గతానికి భిన్నంగా.. తొలిసారిగా గెలిచే అభ్యర్థులకే అధిష్టానం టికెట్‌లు కేటా యించిందని పేర్కొన్నారు. మునుగోడులో గతంలో రికార్డుగా ఉన్న రావి నారాయణరెడ్డి మెజార్టీని అధిగమించాలని కార్యకర్తలకు సూచించారు. మెజార్టీ చూసి రాహుల్‌ స్వయంగా మాట్లాడాలని, ఆయనతో కలసి చౌటుప్పల్‌లో రోడ్‌షో నిర్వహిస్తానని తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్‌ 12 సీట్లను గెలుచుకుంటుందన్నారు.

మరిన్ని వార్తలు