ప్రతీకారం తీర్చుకున్న ‘బ్రదర్స్‌’

24 May, 2019 04:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భువనగిరి పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయంతో కోమటిరెడ్డి బ్రదర్స్‌ మళ్లీ సత్తా చాటారు. గత ఎన్నికల్లో తన తమ్ముడిని ఓడించిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ను ఈసారి అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఓడించి ప్రతీకారం తీర్చుకున్నారు. 2014 పార్లమెంట్‌ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని బూర నర్సయ్యగౌడ్‌ 30,494 ఓట్లతో ఓడించారు. రాజగోపాల్‌ మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవగా, వెంకట్‌రెడ్డి నల్లగొండ నియోజకవర్గం నుంచి కంచర్ల భూపాల్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌ అధిష్టానం భువనగిరి నుంచి వెంకట్‌రెడ్డిని పోటీలో నిలిపింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో వెంకట్‌రెడ్డికి 5,31,014 ఓట్లు రాగా, సిట్టింగ్‌ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌కు 5,26,751 ఓట్లు వచ్చాయి. 4,263 ఓట్ల ఆధిక్యతతో వెంకట్‌రెడ్డి విజయం సాధించారు. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్‌ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.  

ఎమ్మెల్యే, ఎంపీలుగా ...
కోమటిరెడ్డి బ్రదర్స్‌ మరో రికార్డు సృష్టించారు. ఇద్దరికీ దేశ, రాష్ట్ర స్థాయిల్లో పనిచేసే అరుదైన అవకాశం లభించింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 1999 నుంచి వరుసగా 2014 వరకు 4 సార్లు నల్లగొండ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దివంగత వైఎస్‌ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో ఓటమి పాలుకాగా, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడు అసెంబ్లీ నుంచి విజయం సాధిం చారు. 2009 ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గెలుపొందగా, ఇప్పుడు అదే స్థానం నుంచి ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు.

మరిన్ని వార్తలు