నల్లగొండ నుంచే పతనం ప్రారంభం

21 Sep, 2018 01:12 IST|Sakshi

ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శ

నల్లగొండ: నల్లగొండ నుంచే ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ పత నం ప్రారంభమవుతుందని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో కమిటీ కో–చైర్మన్‌ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు, ఉద్యోగులు ఉద్యమించడంతోపాటు ఎంతోమంది ఆత్మబలిదానాలతో తెలంగాణ వస్తే.. ఆ ఫలాలు కేసీఆర్‌ కుటుంబానికే అందు తున్నాయన్నారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తన మేనిఫెస్టోలో 100 అంశాలను పెడితే ఒక్కదాన్నే అమలు చేసిందని మిగిలిన 99 హామీలను నెరవేర్చలేదన్నారు.

ఎన్నికల మేనిఫెస్టోలో మొదటి హామీగా దళితుడిని సీఎం చేస్తామని చెప్పి దాన్ని ఉల్లంఘించారని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిపెట్టకుండా.. ప్రజలకు బర్లు, గొర్లు, కళ్ల అద్దాలు ఇచ్చి తెలంగాణను నాశనం చేస్తున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ తరహాలో కాంగ్రెస్‌ మేనిఫెస్టో ఉండదని, ప్రజలకు చేసేది మాత్రమే చెబుతామన్నారు. తమ మేనిఫెస్టో తయారీలో మేధావు లు, రైతులు.. ఇతర వర్గాలతో చర్చించి ప్రజలకు మేలు చేసే అంశాలను పొందుపర్చుతామన్నారు. 

మిర్యాల గూడలో జరిగిన హత్య సంఘటనలో ఎవరెవరున్నా రో ప్రజలకు తెలుసని.. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ఎవరికి టికెట్లు ఇచ్చాడో అర్థం చేసుకోవాలని కోరారు. ఎన్నికల మేనిఫెస్టో కమిటీ కో– చైర్మన్‌గా తనకు బాధ్యతలు అప్పగించినందుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం ఖాయమని తాను కీలకమైన పదవిలో ఉంటానన్నారు. ఈ సమావేశంలో నల్లగొండ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొడ్డుపల్లి లక్ష్మీశ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు