అన్ని ‘జెడ్పీ’లను కైవసం చేసుకుంటాం

3 Jun, 2019 06:26 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న కోమటిరెడ్డి

నాయకుడనే వాడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండాలి

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్రంలోని 21 జిల్లా పరిషత్‌ చైర్మన్‌లతో పాటు ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి అధ్యక్షతన ఆదివారం మహేశ్వరం నియోజకవర్గంలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులతో జరిగిన సమావేశంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు ఎలాంటి ప్రలోభాలకు గురికావొద్దని, అన్ని జెడ్పీ చైర్మన్‌ స్థానాలను కైవసం చేసుకోవాలని ఆయన సూచించారు. అందుకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందన్నారు. రెండోసారి ముఖ్యమంత్రి అయిత తర్వాత కేసీఆర్‌ అహంకారం పెరిగిపోయిందని ఆరోపించారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్‌రెడ్డి 40వేల మెజారిటీతో గెలుపొందగా, తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు తగిన బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. 

చిరస్థాయిగా నిలిచిపోవాలి
నాయకుడనే వాడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఉండాలని, కానీ నేడు కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట వేల కోట్లు దోచుకోవడం వల్లే తెలంగాణలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సొంత కూతురిని గెలిపించుకోలేకపోయారన్నారు. నాయకుడంటే దివంగత నేత వైఎస్‌.రాజశేఖరరెడ్డి అని, ఆనాడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని గుర్తు చేశారు. అందువల్లే ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు ఆశీర్వదించి సీఎంను చేశారని తెలిపారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ఆనాడు వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి చెల్లెమ్మా అని గౌరవించారని, టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వెళ్లిన ఆమెకు నేడు సీఎం కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు కిచ్చెనగారి లక్ష్మారెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి, ఆలిండియా కిసాన్‌సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎం.కొండారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు