మీరే కోటిసార్లు సిగ్గు పడండి

17 Nov, 2017 03:49 IST|Sakshi

కోమటిరెడ్డి వ్యాఖ్యలపై జగదీశ్‌రెడ్డి ఆగ్రహం

కాలువలోపడి చనిపోయిన విద్యార్థికి గురుకులాలతో సంబంధం లేదు

సాక్షి, హైదరాబాద్‌: నల్లగొండలోని ఓ గురుకుల హాస్టల్‌లో టాయిలెట్‌ సౌకర్యం లేకపోవడంతో ఓ విద్యార్థి   బహిర్భూమికి వెళ్లి కాలువలో పడి మృతి చెందాడంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి చెబుతున్నట్లుగా కెనాల్‌లో పడి చనిపోయిన విద్యార్థికి గురుకులాలు, హాస్టళ్లతో సంబంధం లేదని స్పష్టం చేస్తూనే కాంగ్రెస్‌ తీరుపై ఆయన విరుచుకుపడ్డారు.  ‘‘కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా చేసిన నిర్వాకం వల్లే ఇప్పటికీ తెలంగాణను సమస్యలు పీడిస్తున్నాయి. హాస్టళ్లు ఇట్లున్నాయంటే దానికి కారణం కాంగ్రెస్‌ పార్టీనే. బడుగు బలహీనవర్గాల ప్రజలను ఆ పార్టీ మోసం చేసింది. దీనికి వారు ఒకసారి కాదు కోటిసార్లు సిగ్గుపడాలి. నల్లగొండలో ఓ విద్యార్థి కాలువలో పడి చనిపోయాడంటున్నారు కదా.. ఇక్కడి నుంచి నల్లగొండ వరకు ముక్కు నేలకు రాసుకుంటూ పోవాలి. చేసిన పాపాలకు కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి’’అని డిమాండ్‌ చేశారు.

‘కార్పొరేట్‌’కు దీటుగా..
గురుకులాల్లో పనిచేస్తున్న తాత్కాలిక అధ్యాపకులను పర్మినెంట్‌ చేసేందుకు సిద్ధంగానే ఉన్నామని, ఈలోగా ఎవరి ఒత్తిడి వల్లో వారు కోర్టుకెళ్లారని, అక్కడ తీర్పు రిజర్వ్‌ చేసినందున అది తేలాక చర్యలు తీసుకుంటామని జగదీశ్‌రెడ్డి తెలిపారు. కార్పొరేట్‌ కాలేజీలను తలదన్నే స్థాయిలో కేజీ టూ పీజీలో భాగంగా గురుకులాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో అదనపు వసతుల కోసం రూ. 347 కోట్లు, 18 బీసీ గురుకుల పాఠశాలలకు భవనాల నిర్మాణం, అసంపూర్తి వాటిని పూర్తి చేసేందుకు కలిపి రూ. 250 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. విద్యార్థులకు నెలలో నాలుగు పర్యాయాలు చికన్, రెండుమార్లు మటన్, ఐదుసార్లు కోడిగుడ్డు, నిత్యం పప్పు, కూర, చా రుతో పౌష్టికాహారం పెడుతున్నామన్నారు.

మరిన్ని వార్తలు