‘బీజేపీలో ఎప్పుడు చేరేది త్వరలోనే చెబుతా’

19 Jul, 2019 08:33 IST|Sakshi

నాయకత్వ లోపంవల్లే ఆ 12 మంది కాంగ్రెస్‌ను వీడారు : రాజగోపాల్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : సాంకేతిక సమస్యలు అడ్డంకిగా ఉన్న కారణంగానే బీజేపీలోకి చేరకుండా ఆగుతున్నానని, ఆ పార్టీలోకి ఎప్పుడు చేరేదీ త్వరలోనే చెబుతానని ఆయన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద గురువారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అంటే తనకు ఎప్పటికీ అభిమానమేనని అందుకే తనకు జారీ చేసిన షోకాజ్‌కు సమాధానం ఇచ్చానన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ప్రజలు 19 మందిని గెలిపించినా కేవలం నాయకత్వలోపం వల్లే 12 మంది పార్టీ ని వీడారని ఆరోపించారు. టీపీసీసీ నాయకత్వ లోపాలను తాను మీడియా ముందు ఎత్తిచూపినందుకు, పార్టీకి భవిష్యత్తులో ఎదురయ్యే ముప్పును ప్రస్తావించినందుకు తనకు షోకాజ్‌ నోటీసులు వచ్చాయన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు పార్టీ అంతర్గత సమావేశాల్లో చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను బీజేపీని, మోదీ పాలనను పొగిడిన విషయం వాస్తవమేనన్నారు. తనకు బీజేపీలో తలుపులు మూసుకుపోలేదన్నారు. తనకు కాంగ్రెస్‌లో పదవులు ముఖ్యం కాదని, ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్న టీఆర్‌ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు. 

మాతో రండి.. మీడియా పాయింట్‌లో రాజగోపాల్‌రెడ్డికి శ్రీధర్‌బాబు ఆహ్వానం   
కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిల మధ్య అసెంబ్లీ మీడియా పాయింట్‌లో గురువారం ఆసక్తికర సన్నివేశం జరిగింది. సభ ముగిసిన తర్వాత మీడియా పాయింట్‌లో రాజగోపాల్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతున్న సమయంలోనే కాంగ్రెస్‌ సభ్యులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, సీతక్క, పోదెం వీరయ్యలు అక్కడకు చేరుకున్నారు. రాజగోపాల్‌ మాట్లాడేంతవరకు వేచి చూసిన తర్వాత ‘కాంగ్రెస్‌ తరఫున విలేకరులతో మాట్లాడేందుకు వెళ్తున్నాం.. నువ్వు కూడా కాంగ్రెస్‌ సభ్యుడివే కదా మాతోపాటు రండి’అంటూ శ్రీధర్‌బాబు ఆయనను ఆహ్వానించారు. అందుకు రాజగోపాల్‌రెడ్డి స్పందిస్తూ.. ‘రావాల్నా..సరే వస్తున్నా మీరు వెళ్లండి’అంటూ వారికి బదులిచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపు అక్కడే విలేకరులతో మాట్లాడిన రాజగోపాల్‌ కాంగ్రెస్‌ సభ్యుల వద్దకు వెళ్లకుండానే అక్కడి నుంచి నిష్క్రమించారు. 

మరిన్ని వార్తలు