కాంగ్రెస్‌లో.. ‘కోమటిరెడ్డి’ కలకలం !

17 Jun, 2019 09:46 IST|Sakshi
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి శనివారం చేసిన విమర్శలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీని వీడగా.. తాజాగా రాజగోపాల్‌రెడ్డి కూడా పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడంతో.. ఆయన కూడా పార్టీ వీడుతారనే చర్చ సాగుతోంది.

సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంట్‌ స్థానాలను గెలుచుకున్న ఆనందం కాంగ్రెస్‌లో ఆవిరి అవుతున్నట్లే కనిపిస్తోంది. ఆ ఎన్నికల్లో వచ్చిన విజయం అందించిన ఉత్సాహం పట్టుమని నెల రోజులు కూడా నిలబడలేదని సగటు కాంగ్రెస్‌ కార్యకర్త ఉసూరుమంటున్నారు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి, స్థానిక సంస్థల ఎన్నికల్లో అపజయాన్ని దిగమింగుకుంటున్న తరుణంలోనే ఆ పార్టీ నాయకుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. ఆయన ప్రకటన దుమారం కేవలం నల్లగొండ జిల్లాకే పరిమితం కావడం లేదు. పార్టీ నాయకత్వం తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన రాజగోపాల్‌రెడ్డి అడుగులు కమలం గూటివైపు వడివడిగా పడుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికిప్పుడు బీజేపీలో చేరాలన్న నిర్ణయం తీసుకోలేదని ఆయన చెబుతున్నా.. అంతిమంగా తీసుకోబోయే నిర్ణయం మాత్రం అదే అయివుంటుందని చెబుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ నాయకత్వం పూర్తిగా విఫలమైన తరుణంలో ఇక టీఆర్‌ఎస్‌కు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని ఆయన కుండబద్దలు కొట్టారు. దీంతో జిల్లా కాంగ్రెస్‌ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.

ఉత్తమ్, కుంతియాపై.. విమర్శలు..
కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకత్వమంతా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత, సీనియర్‌ నాయకుడు కుందూరు జానారెడ్డి, మాజీ మంత్రి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరో సీనియర్, మాజీ మంత్రి ఆర్‌.దామోదర్‌రెడ్డి వంటి నేతలున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో, ప్రధానంగా దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌ బలంగా ఉన్న జిల్లాగా ఉమ్మడి నల్లగొండకు పేరుంది. దానికి తగినట్లే మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో రెండుకు రెండు ఎంపీ స్థానాలను గెలుచుకుంది.

అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాలకే పరిమితం అయినా.. రాష్ట్రంలో వీచిన టీఆర్‌ఎస్‌ గాలిని తట్టుకుని సాధించిన విజయం కావడంతో ఆ పార్టీ వర్గాలు కొంత సంతృప్తిగానే ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. జిల్లాకే చెందిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌పైనా ఆయన వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా రాజగోపాల్‌రెడ్డి ఇటు ఉత్తమ్‌పైనా, అటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఆర్‌సి.కుంతియాపైనా త్రీవస్థా యిలో ధ్వజమెత్తారు. ఇప్పుడు సరిగ్గా అదే ఇద్దరు నేతల వైఫలమ్యే రాష్ట్ర కాంగ్రెస్‌ దుస్థితికి కారణమని వేలెత్తి చూపారు.

పీసీసీ పీఠం దక్కదని తెలిసే.. తిరుగుబాటు చేశారా?
రాష్ట్ర కాంగ్రెస్‌ సారథ్యం కోసం ఎప్పటి నుంచే కోమటిరెడ్డి సోదరులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఆ పీఠంపై రాజగోపాల్‌రెడ్డికి ఆశ ఉందని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర నాయకత్వ మార్పు ఉంటుందని అప్పట్లో జాతీయ నాయకత్వం సంకేతాలు ఇచ్చిందని, కానీ, మార్పు మాత్రం జరగలేదన్న అసంతృప్తి వీరిలో ఉందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. ఎంపీ టికెట్‌ దక్కించుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. స్థానిక ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి జిల్లా నాయకులు ఎవరూ ముందుకు రాకపోవడంతో మళ్లీ కోమటిరెడ్డి సోదరులే ముందుకు వచ్చి, రాజగోపాల్‌ రెడ్డి భార్య లక్ష్మిని పోటీకి నిలబెట్టి, విజయం కోసం బాగానే ఖర్చుపెట్టారు. ఈ ఎన్నికల్లో జిల్లా సీనియర్లుగానీ, టీపీసీసీ చీఫ్‌గానీ సీరియస్‌గా తీసుకుని పనిచేయలేదన్నది రాజగోపాల్‌రెడ్డి అభియోగం. జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో సైతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లాలోని 31 మండలాలకు గాను 23 మండలాల్లో, రంగారెడ్డి తదితర జిల్లాల్లోనూ బాధ్యతలు మీదేసుకుని పనిచేశారు. ఇంత చేసినా.. జాతీయ నాయకత్వం గుర్తించకపోవడం, పీసీసీ పదవికి సోదరుల పేర్లను పరిశీలించకపోవడంతో రాజగోపాల్‌రెడ్డి తిరుగుబాటు జెండా ఎగరేశారని విశ్లేషిస్తున్నారు.

అడుగులు.. కమలం గూటివైపేనా..?
కాంగ్రెస్‌ నాయకత్వాన్ని తూర్పారా బట్టిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతారన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. ఒకవైపు కాంగ్రెస్‌ నాయకత్వ వైఫల్యాలను ఎండగడుతూనే.. అదేస్థాయిలో బీజేపీని పొగిడిన వైనం చూస్తే.. ఆయన కమలం గూటికి చేరడం ఖాయమని అర్థమవుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, తన తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి చేసిన ప్రకటనపై, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించ లేదు. జిల్లా కాంగ్రెస్‌కు పెద్దదిక్కుగా ఉన్న కోమటిరెడ్డి సోదరులు ఇప్పుడెలాంటి నిర్ణయం తీసుకుంటారు? రాజగోపాల్‌రెడ్డి ఒక్కరే పార్టీ మారుతారా? అయితే, వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా..? లేక ఆయనా మరేదైనా నిర్ణయం తీసుకుంటారా..? అన్న ప్రశ్నలు ప్రస్తుతం కాంగ్రెస్‌ కార్యకర్తల మదిని తొలుస్తున్నాయి.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు