నేను మాట్లాడింది పార్టీ మంచికే..

28 Jun, 2019 08:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని పునర్నిర్మించే దిశగా తాను అనేక సూచనలు చేశానని, వాటిలో వేటినీ పార్టీ పట్టించుకోలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. పార్టీపై కానీ, నేతలపై కానీ తానెలాంటి వ్యాఖ్యలు చేసినా అది పార్టీ మంచికేనని వెల్లడించారు. టీపీసీసీ క్రమశిక్షణ సంఘం జారీ చేసిన షోకాజ్‌ నోటీసుకు రాజగోపాల్‌రెడ్డి స్పందించారు. గురువారం క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ కోదండరెడ్డిని రాజగోపాల్‌రెడ్డి పీఏ కలసి వివరణ లేఖ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పదిరోజుల క్రితం రాజగోపాల్‌రెడ్డికి షోకాజ్‌ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.

దీనిపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించిన నేపథ్యంలో ఆయన మూడు పేజీల వివరణ ఇచ్చారు. అందులో 2018లో ఇచ్చిన నోటీసుకు సైతం వివరణ ఇచ్చానని, అయినా పార్టీ తన సూచనలు పట్టించుకోలేదని పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యలో తప్పులేదు కాబట్టే ఆ తర్వాత తనకు మునుగోడు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చారు కదా? అని లేఖలో రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. పార్టీ తీరు మార్చుకోవాలని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని పేర్కొన్నారు. పార్టీ ఓడిపోతే రాహుల్‌గాంధీ రాజీనామా చేశారని, అలాంటప్పుడు పీసీసీ అధ్యక్షుడు రాజీనామా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తాను పార్టీలో ఉన్న లోపాలను ఉన్నది ఉన్నట్లుగానే చెబుతుంటే, పార్టీ నేతలు దాన్ని భిన్నంగా తీసుకుంటున్నారు తప్పితే సరిద్దిదుకోవడం లేదని లేఖలో పేర్కొన్నారు.

పొంతన లేదు: కోదండరెడ్డి
రాజగోపాల్‌రెడ్డి షోకాజ్‌ నోటీసుకు సంబంధించి న వివరణ అందిందని, అయితే నోటీసుకు, వివరణకు పొంతన లేదని క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ కోదండరెడ్డి తెలిపారు. క్రమశిక్షణా సంఘం చైర్మన్‌గా తాను మీడియాతో ఈ అంశంపై మాట్లాడకూడదని, పార్టీ శ్రేణులకు స్పష్టత ఇవ్వడానికే స్పందిస్తున్నానని చెప్పారు. గతంలో నోటీసులకు వివరణ ఇవ్వకున్నా ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చారని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్న అంశాలను ప్రస్తావించగా, గతంలో పొరపాటు జరిగిందని కుంతియాకు ఆయన చెప్పడం వల్లే వదిలేశామన్నారు. రాజగోపాల్‌రెడ్డి ఇచ్చిన షోకాజ్‌ నోటీసు, వివరణను అధిష్టానానికి పంపామని చెప్పారు. కాం గ్రెస్‌ని తూలనాడి, ఇతర పార్టీలను నెత్తిన పెట్టుకోవడం సరికాద న్నారు. తాను తప్పుగా మాట్లాడననిగానీ, పార్టీలో కొనసాగుతాననిగానీ వివ రణలో ఎక్కడా పేర్కొనలేదని తెలిపారు.  

మరిన్ని వార్తలు