బీజేపీ వైపే.. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మొగ్గు

20 Jun, 2019 10:16 IST|Sakshi

దగ్గరి అనుచరులతో మునుగోడు ఎమ్మెల్యే 

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మంతనాలు

హైదరాబాద్‌లోని తన ఇంటిలో ప్రత్యేక భేటీ

కార్యకర్తలు కూడా కమలం వైపు ఆసక్తి

గురువారం మరోసారి సమావేశం కావాలని నిర్ణయం

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వంపై ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తన రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయించుకునే పనిలో పడ్డారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు, సీఎం కేసీఆర్‌ పాలనకు ఎదురొడ్డి నిలిచే శక్తి కాంగ్రెస్‌కు లేదని, టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని ఆయన కుండబద్ధలు కొట్టారు. ఈ ప్రకటనతో ఆయన కాంగ్రెస్‌ గూటిని వీడి కమలం వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు అన్న అభిప్రాయం బలపడింది. కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన సమయంలోనే తాను బీజేపీలో చేరాలని ఇంకా నిర్ణయించుకోలేదని, నియోజకవర్గంలో తన అనుచరులు,  కుటుంబ సభ్యులతో మాట్లాడాక ఓ నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు.

రెండు మూడు రోజులుగా ఇలాంటి ప్రకటనలు చేయకుండా మౌనంగా ఉన్న రాజగోపాల్‌ రెడ్డి  బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్‌ కార్యకర్తలు, అనుచరులతో భేటీ అయ్యారని పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే రాజగోపాల్‌ రెడ్డి ప్రకటన నేపథ్యంలో ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ క్రమశిక్షణ సంఘం ఆయనకు షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసింది. కాంగ్రెస్‌లో కొనసాగడం వల్ల రాజకీయంగా పెద్దగా భవిష్యత్‌ లేదన్న అభిప్రాయంలో ఉన్న ఆయన బీజేపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెబుతున్నారు. బుధవారం నాటి సమావేశానికి హాజరైన ఆయన దగ్గరి అనుచరులు, ముఖ్య కార్యకర్తలు కూడా బీజేపీలో చేరడానికి మొగ్గు చూపారని అంటున్నారు. గురువారం మరోమారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భేటీ కావాలని,  ఈ అంశంపై కూలంకషంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని సమావేశాన్ని ముగించారని సమాచారం.   

మరిన్ని వార్తలు