తెలంగాణలో ఈ రోజు బ్లాక్‌డే

13 Mar, 2018 20:35 IST|Sakshi

కేసీఆర్‌ నియంత..

మండిపడ్డ కోమటిరెడ్డి, సంపత్‌

గాంధీభవన్‌లో ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష

సాక్షి, హైదరాబాద్‌: నిన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో తమ శాసనసభ్యత్వాలను రద్దుచేయడాన్ని  నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ మంగళవారం సాయంత్రం గాంధీభవన్‌లో దీక్షకు దిగారు. ‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’ పేరిట 48 గంటలపాటు కొనసాగనున్న నిరాహార దీక్ష ప్రారంభం సందర్భంగా కోమటిరెడ్డి, సంపత్‌ తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ చరిత్రలో ఈ రోజు బ్లాక్‌ డే అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి అభివర్ణించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా మనమంతా పనిచేద్దామని కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు.

తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌లాగా ఆస్పత్రిలో తాను దొంగ దీక్షలు చేయలేదని అన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు ప్రాజెక్టులు అప్పగించి.. కేసీఆర్‌ కమీషన్లు దండుకుంటున్నారని మండిపడ్డారు. ఉప ఎన్నికలకు భయపడేది లేదని, సంపత్‌ను 50వేల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. పోడియం వద్ద ఉన్నా సమయంలో తాను విసిరివేసిన పేపర్లు చూపిస్తున్నారు, కానీ, స్వామి గౌడ్‌కు గాయం అయ్యే సమయంలో విజువల్స్ చూపించడం లేదని అన్నారు. 2019 ఎన్నికలో తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ఫ్యామిలీ ఓడించి, బయటి దేశాలకు పంపిద్దామని అన్నారు. ఎమ్మెల్యే సంపత్‌ మాట్లాడుతూ.. ఆలంపూర్‌ ప్రజలు తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపారని,  రైతులు, విద్యార్థులు, యువత గొంతుగా తాను అసెంబ్లీలో గళమెత్తానని అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూపంపిణీ హామీ ఏమైందని కేసీఆర్‌ను ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు