మైహోంకు దోచిపెడుతున్నారు: కోమటిరెడ్డి

3 Jan, 2020 19:15 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పేద ప్రజలపై ప్రేమ లేదని, ప్రాజెక్టుల పేరుతో మైహోం రామేశ్వర్‌రావుకు దోచిపెడుతున్నారంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా శుక్రవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి కోమటిరెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ..  కేసీఆర్‌, ఆయన కుటుంబం కలిసి అభివృద్ధి పేరుతో రూ. 2 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. మిగులు బడ్జెట్‌గా ఉన్న తెలంగాణను లోటు బడ్జెట్‌ కింద మార్చారని విమర్శించారు. కేసీఆర్‌ అనాలోచిత నిర్ణయం వల్లే ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ. 2లక్షల కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్‌ మూసీ ప్రక్షాళలను గాలికి వదిలేసారని దుయ్యబట్టారు. పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానని చెప్పి కేసీఆర్‌ మాట తప్పారని విమర్శించారు.

ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎప్పుడు ముందుండే కాంగ్రెస్‌ను మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుంచి మున్సిపాలిటీల అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకువస్తామని, మూసీ ప్రక్షాళనకు ప్రధాని మోదీని కలిసి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తానని వెల్లడించారు. కాగా మున్సిపాలిటీ అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే ఆరుసార్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి నిధులు తీసుకువచ్చానని స్పష్టం చేశారు. తాను కేంద్రం వెంటపడి ఎల్బీ నగర్‌ నుంచి హయత్‌నగర్‌, పెద్ద అంబర్‌పేట నుంచి అందోల్‌ మైసమ్మ గుడి వరకు ఎనిమిది లైన్ల రోడ్డును తెచ్చామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మల్‌రెడ్డి రంగారెడ్డి, ఇతరులు పాల్గొన్నారు.
(కేటీఆర్‌కు కాంగ్రెస్‌ గురించి బాగా తెలుసు : కోమటిరెడ్డి)

మరిన్ని వార్తలు