‘దళితుడు ప్రతిపక్షనేతగా ఉంటే ఓర్వలేదు’

10 Jun, 2019 14:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసిన కేసీఆర్‌.. కనీసం ప్రతిపక్ష నేతగా దళితుడు ఉంటే కూడా ఓర్వలేదని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. టీఆర్‌ఎస్‌ తీరుకు నిరసనగా మంగళవారం కలెక్టరేట్‌ల ముందు కాంగ్రెస్‌ నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు.  సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ..సీఎం కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తూ ప్రశ్నించడానికి ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. నాయకులు పార్టీ మారినా.. కార్యకర్తలు పార్టీ మారలేదన్నారు. అసెంబ్లీలో ఆరు మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పంచ పాండవుల్లా..100 మంది టీఆర్‌ఎస్‌ కౌరవ ఎమ్మెల్యేలపై పోరాటం చేస్తారని తెలిపారు. పార్లమెంట్‌లో ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు త్రిమూర్తుల్లా పోరాటం చేస్తామన్నారు. పార్టీ పిరాయింపులపై చట్టంలో మార్పులు తేవాలని అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో టీఆర్‌ఎస్‌ నామరూపం లేకుండా పోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తేనే సంక్షేమ పథకాలు అందుతాయని బెదిరించి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. 

>
మరిన్ని వార్తలు