'కేసీఆర్‌ను ప్రజలు రాళ్లతో కొట్టే రోజులు వస్తాయి'

29 May, 2020 16:05 IST|Sakshi

సాక్షి, నల్గొండ : పట్టణంలోని మామిళ్లగూడెంలో కరోనాతో చనిపోయిన కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి కుటుంబసభ్యులను కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారం పలువురు కాంగ్రెస్‌ కార్యకర్తలతో కలిసి పరామర్శించారు. దయాకర్ రెడ్డి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ' పోతిరెడ్డిపాడు విస్తరణ జీవో 203ను తక్షణమే రద్దు చేయాలి. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్ స్కీంతో నాగార్జునసాగర్‌కు చుక్క నీరు రాదు. కుట్రలో భాగంగానే దక్షిణ తెలంగాణను ఎడారి చేయడమే కేసీఆర్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. కమీషన్ల కోసమే గోదావరి నీళ్లను కృష్ణాలో కలుపుతామంటున్నారు. కొండపోచమ్మ ప్రాజెక్టుతో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఏడారిగా మారుతుంది. గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లను పక్కన పెట్టారు. అందుకే ఈ రోజు కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వంపై పోరాటానికి మేమెంతా సిద్ధంగా ఉన్నాం. జూన్ 2న ప్రాజెక్టుల వద్ద తలపెట్టిన ధర్నాలను కాంగ్రెస్‌ శ్రేణులు విజయవంతం చేయాలి. పార్టీలకు అతీతంగా అందరూ ఈ పొరాటంలో కలిసి రావాలి. ఎస్ఎల్‌బీసీ సొరంగ మార్గానికి రూ. వెయ్యి కోట్లు ఇస్తే ప్రాజెక్టు పూర్తి అయ్యేది. కానీ నిధులన్ని కేసీఆర్  కుటుంబానికి, నీళ్లు మాత్రం ఆంధ్ర ప్రాంతానికి తరలి పోతున్నాయి. ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్‌ను ప్రజలు రాళ్లతో కొట్టే రోజులు వస్తాయి.  ఖబద్దార్‌ కేసీఆర్... ఇక ముందు నీ ఆటలు సాగవు. పోతిరెడ్డిపాడు ఇష్యూను పక్కదోవ పట్టించేందుకే కొండపోచమ్మలో సంబరాలు నిర్వహిస్తున్నారు.  కొండపోచమ్మ ద్వారా కూడా ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు... తగిన సమయంలో బుద్ధి చెబుతారంటూ' మండిపడ్డారు. 
లండన్‌లో భారత సంతతి వైద్యుడి మృతి
వారం రోజుల్లోనే రైతులకు తీపి కబురు

మరిన్ని వార్తలు