భావోద్వేగానికి లోనైన కోమటిరెడ్డి

12 Dec, 2018 17:47 IST|Sakshi

సాక్షి, నల్లగొండ : అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. నల్గొండ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన ఆయన.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోమటిరెడ్డిని కలిసేందుకు కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆయన నివాసానికి వచ్చారు. దీంతో భావోద్వేగానికి గురైన ఆయన.. ప్రజాతీర్పును గౌరవిస్తానని పేర్కొన్నారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజాసేవే తనకు ముఖ్యమని వ్యాఖ్యానించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన ప్రజలకు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఉద్వేగానికి లోనయ్యారు.

నల్లగొండను దత్తత తీసుకోండి...
ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలకు కోమటిరెడ్డి అభినందనలు తెలిపారు. తన పదవీకాలంలో జిల్లాలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఏర్పాటుకు, తాగు- సాగునీటి సమస్యల నివారణకు కృషి చేశాననని.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అభివృద్ధిని కొనసాగించాలని ఆకాంక్షించారు. టీఆర్‌ఎస్‌ అధినేత, కాబోయే సీఎం కేసీఆర్‌ నల్లగొండ జిల్లాను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని కోరారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి.. కాంగ్రెస్‌ అధిష్టానం ఎంపీగా టికెట్‌ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు