సోనియాగాంధీతో కోమటిరెడ్డి భేటీ

12 Mar, 2020 12:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఆ పార్టీ సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ అయ్యారు. సోనియా పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన కోమటిరెడ్డి.. గురువారం ఉదయం ఆమెతో సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాలపాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయాలపై కీలక చర్చ జరిగినట్లు సమాచారం.

భేటీ అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా తనకు అవకాశం ఇవ్వాలని సోనియాను కోరినట్లు చెప్పారు. రెండు మూడు రోజుల్లోనే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ నిరంకుశ, నియంతృత్వ విధానాలను అనుసరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ విధానాలపై గట్టిగా పోరాడేందుకు కాంగ్రెస్‌కు కొత్త నాయకత్వం కావాలని కోమటిరెడ్డి అన్నారు. 

కాగా, త్వరలో కొత్త పీసీసీ అధ్యక్షుడి ప్రకటన ఉంటుదన్న నేపథ్యంలో సోనియాను  కోమటిరెడ్డి కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడి రేసులో తాను ఉన్నానని కోమటిరెడ్డి ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో చర్చిస్తానని ఇటీవల ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ పదవి కోసం పార్టీలో పలువురు ఆశావహులు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఈ పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌తో పాటు భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి వంటి ముఖ్యులు పోటీపడుతున్నారు. ఈ మేరకు వారు ఆసక్తి చూపుతున్నట్లు పలు వ్యాఖ్యలు కూడా చేశారు.

మరిన్ని వార్తలు