కొమురవెల్లి మల్లన్నను కేసీఆర్‌ మోసం చేశారు : కోమటిరెడ్డి

22 Dec, 2019 20:00 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట : కొమురవెల్లిలో డబుల్‌ రోడ్లు వేస్తానని, రింగ్‌ రోడ్డు నిర్మాణం చేపడతానని ప్రగల్బాలు పలికిన సీఎం కేసీఆర్‌ ప్రజలతో పాటు కొమురవెల్లి మల్లన్నను మోసం చేశారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి విమర్శించారు. ఆదివారం కొమురవెల్లి మల్లన్నను దర్శించుకొన్న వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మల్లన్న ఆశీస్సులతో రైతులు, ఇక్కడికి వచ్చే భక్తులు సుఖసంతోషాలతో ఉండాలని తాను మల్లన్న స్వామిని కోరినట్లు కోమటిరెడ్డి పేర్కొన్నారు.

కేసీఆర్‌ పాలన చేపట్టి 6 సంవత్సరాలు గడుస్తున్నా కొమురవెల్లిలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని వెల్లడించారు. కమీషన్ల ప్రాజెక్టులకు రూ.200 కోట్లు కేటాయించే కేసీఆర్‌ దేవాలయానికి కేటాయించడా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చైనా సరే కొమురవెల్లిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కొందరు రాజకీయాలు చేసి మల్లన్న శైవక్షేత్రం పక్కనే శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారని, దేవాలయం పక్కన శ్మశానవాటికను నిర్మించొద్దని తాను కలెక్టర్‌ను కలిసి కోరినట్లు తెలిపారు. అందుకు కలెక్టర్‌ వెంటనే స్పందిస్తూ అక్కడ శ్మశాన వాటికను ఏర్పాటు చేయమని తనకు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అడిషనల్‌ డిసిపి నర్సింహారెడ్డి అక్రమ అరెస్టును తాను తీవ్రంగా ఖండిసున్నట్లు కోమటిరెడ్డి వెల్లడించారు. హరీశ్‌రావు వెంటనే  డిసిపి అరెస్టుపై స్పందించాలని కోమటిరెడ్డి డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు