పెండింగ్‌ కాల్వల పూర్తికి శ్రమిస్తా

7 Apr, 2019 11:24 IST|Sakshi
ముఖాముఖిలో భువనగిరి ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

సాక్షి, భువనగిరి: భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మోడల్‌గా తీర్చిదిద్దుతానని కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను వివరించారు. గత 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న తనకు ప్రజల సమస్యలు వాటి పరిష్కారం తెలుసన్నారు. ఈనియోజకవర్గంలో ప్రధానంగా సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ప్రతి ఎకరానికి సాగునీరందించడమే నా లక్ష్యం. ధర్మారెడ్డి, పిలాయిపల్లి, బునాదిగాని కాల్వలను పూర్తి చేసి దాని ఆయకట్టులోని రైతులందరికీ అందిస్తా. తపాస్‌పల్లి రిజర్వాయర్‌ ద్వారా ఆలేరు నియోజకవర్గానికి రావాల్సిన సాగునీటిని హరీశ్‌రావు సిద్దిపేటకు తరలించుకుపోయారు.

నేను గెలిచిన వెంటనే ఆలేరు నియోజకవర్గ రైతాంగానికి తపాస్‌పల్లి జలాలు అందే విధంగా చర్యలు తీసుకుంటా. ఈ ప్రాంతంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి భువనగిరి, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నంలను కలుపుతూ ఐటీ కారిడార్‌ ఏర్పాటుకు కృషి చేస్తా. నేను గెలిచిన ఏడాదిలోనే నిమ్స్‌ను ఎయిమ్స్‌గా ప్రారంభింపజేసి సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందించడానికి ప్రధానిపై ఒత్తిడి తీసుకువస్తా. ప్రతి గ్రామానికి ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన పథకం కింద లింక్‌ రోడ్లను నిర్మిస్తాం. అలాగే అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీలు, పార్క్‌ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తా. భువనగిరిలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి బస్‌ డిపో ఏర్పాటుతో పాటు యాదగిరిగుట్ట బస్టాండ్‌ను మరింత విస్తరింపజేస్తా. భువనగిరి, ఆలేరు, జనగామలో అన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆపే విధంగా కృషి చేస్తా. 

ప్రజలతో ఉన్న అనుబంధమే గెలిపిస్తుంది
30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న నాకు విస్తృతమైన ప్రజాసంబంధాలు ఉన్నాయి. 20 ఏళ్లు ఎమ్మెల్యేగా నల్లగొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాను. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసి ఉద్యమంలో ముందున్నా. దీంతోపాటు రైతాంగం, కార్మికులు, యువకులు, విద్యార్థులు, మేధావులు రాజకీయాలతో సంబంధాలు లేకుండా నన్ను గెలిపించడానికి కలిసి వస్తున్నారు.

నా సోదరుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 2009లో భువనగిరి ఎంపీగా గెలిచి చేసిన సేవలు నా గెలుపునకు మరింత దోహదపడతాయి. ప్రస్తుత ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌కు రాజకీయాలతో సంబంధం లేదు. ఎంపీగా ఉండి ఏ గ్రామానికి వెళ్లలేదు. దీంతో ఆయనకు ఎక్కడికక్కడ వ్యతిరేకత ఎదురవుతుంది. కనీస ఆదాయ పథకం, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, ఏడాదిలోనే 34 లక్షల ఉద్యోగాల నియామకం కలిసి వచ్చే అంశం. 

మరిన్ని వార్తలు