‘ఆరుట్ల’ జంట..ఇండిపెండెంట్ల పంట

22 Nov, 2018 03:57 IST|Sakshi

1962 : పుంజుకున్న ‘రెడ్డి’.. 41 మంది ఎన్నిక

అసెంబ్లీలోకి జంటగా అడుగుపెట్టిన ఆరుట్ల దంపతులు

వెనుకబడిన బ్రాహ్మణులు..పట్టు పెంచిన వెలమలు

అత్యధికంగా 19 మంది ఇండిపెండెంట్ల గెలుపు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు కలిపి ఉమ్మడి రాష్ట్ర ఎన్నికలు మొదటిసారిగా 1962లో జరిగాయి. తెలంగాణలో మొత్తం 106 శాసనసభ స్థానాలు ఉండగా, కాంగ్రెస్‌  పార్టీ అరవై ఎనిమిది సీట్లు గెలుచుకుంది. అంతకుముందు కాస్త బలంగా కనిపించిన కమ్యూనిస్టులు బాగా దెబ్బతిని పదిహేను స్థానాలకు పడిపోయారు. కొత్తగా వచ్చిన స్వతంత్ర పార్టీ మూడు సీట్లు, సోషలిస్టులు రెండు స్థానాలు గెలుచుకున్నారు. ఇండిపెండెంట్లు పందొమ్మిది మంది గెలిచారు. కాంగ్రెస్‌లో టిక్కెట్లు రాని బలమైన అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా పోటీచేసి గెలిచిన సందర్భాలు కూడా అధికంగానే ఉన్నాయి. సామాజిక వర్గాల వారీగా చూస్తే రెడ్లు అత్యధికంగా 41 మంది గెలిస్తే ఆ తర్వాత బ్రాహ్మణులు పన్నెండు మంది గెలిచారు. రెడ్లు క్రమేపీ రాజకీయంగా పుంజుకుంటే బ్రాహ్మణులు వెనుకబడి పోయారు. కాగా బీసీ సామాజిక వర్గాల ఎమ్మెల్యేల సంఖ్య కొద్దికొద్దిగా పెరుగుతూ వచ్చింది.

ఈసారి పన్నెండు మంది బీసీ నేతలు ఎన్నికయ్యారు. వారిలో మున్నూరు కాపు వర్గానికి చెందిన వారు ముగ్గురు, ముదిరాజ్‌ సామాజిక వర్గం నుంచి ముగ్గురు, గౌడ ఇద్దరు, యాదవ ఒకరు, పద్మశాలి ఒకరు, ఉప్పర ఒకరు, కురుమ ఒకరు గెలిచారు. వెలమ సామాజిక వర్గం నుంచి ఏడుగురు, ముస్లింలు ఏడుగురు గెలుపొందారు. ఎస్‌సీలలో పద్దెనిమిది మంది రిజర్వుడ్‌ స్థానాలలో గెలిస్తే, ఒకరు జనరల్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. వైశ్యులు ముగ్గురు గెలిచారు. కమ్మ సామాజికవర్గం వారు ఇద్దరు గెలిచారు. ఎస్టీ అభ్యర్థులు ఇద్దరు గెలుపొందారు. ఇండిపెండెంట్లుగా 19 మంది గెలుపొందడం ఈ ఎన్నికల్లో గమనించదగిన పరిణామం.

తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం వారు కాంగ్రెస్‌ నుంచి ఇరవై ఒక్కమంది గెలిస్తే సీపీఐ పక్షాన ఏడుగురు విజయం సాధించారు. వీరిలో అత్యధికులు నల్లగొండ నుంచి గెలుపొందారు. ఇండిపెండెంట్లుగా పది మంది గెలుపొందారు. ఆ రోజులలో పార్టీలతో పాటు వ్యక్తుల ప్రభావం ఎక్కువగానే ఉండేది. కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన రెడ్డి సామాజిక వర్గ ప్రముఖులలో మర్రి చెన్నారెడ్డి, టీ.అంజయ్య, పీ.నర్సారెడ్డి, జీ.సంజీవరెడ్డి, సీ.మాధవరెడ్డి, ఎమ్‌.బాగారెడ్డి, పీ.రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. ఎం.రాంగోపాల్‌రెడ్డి రెండుచోట్లా ఇండిపెండెంటు అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. సీపీఐ నుంచి గెలిచిన ప్రముఖులలో విఠల్‌రెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, కె.రామచంద్రారెడ్డి వంటి నేతలు ఉన్నారు. ఆరుట్ల రామచంద్రారెడ్డి భువనగిరి నుంచి గెలిస్తే, ఆయన సతీమణి కమలాదేవి ఆలేరు నుంచి విజయం సాధించి, ఉమ్మడి శాసనసభలో ప్రవేశించిన తొలి దంపతుల జంటగా రికార్డు నెలకొల్పారు. ఇంకా సంయుక్త సోషలిస్టు పార్టీ నుంచి ఒకరు, స్వతంత్ర పార్టీ నుంచి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గీయులు నాటి ఎన్నికల్లో గెలుపొందారు.

పెరిగిన వెలమల ప్రాతినిధ్యం
ఈ ఎన్నికల్లో వెలమ సామాజికవర్గం నుంచి ఏడుగురు గెలిస్తే వారిలో కాంగ్రెస్‌ నుంచి ముగ్గురు, సీపీఐ నుంచి ఒకరు, సోషలిస్టు పార్టీ నుంచి ఒకరు, ఇండిపెండెంటుగా ఒకరు నెగ్గారు. గెలిచిన ప్రముఖులలో జలగం వెంగళరావు, జేవీ నరసింగరావు, ఎన్‌.యతిరాజారావు ప్రభృతులు ఉన్నారు. 1952 నుంచి పరిశీలిస్తే.. వెలమ సామాజిక వర్గం నుంచి చట్టసభలకు ఎన్నికయ్యే వారి సంఖ్య స్వల్పంగానైనా పెరుగుతుండటం గమనించవచ్చు.

పట్టుపెంచిన బీసీలు
వెనుకబడిన తరగతులకు ఈ ఎన్నికలలో ప్రాధాన్యం పెరిగిందని చెప్పాలి. కాంగ్రెస్‌ నుంచి ఎనిమిది మంది, సీపీఐ నుంచి ముగ్గురు, ఇండిపెండెంటుగా ఒకరు ఎన్నికయ్యారు. ఈ వర్గం నుంచి గెలిచిన కాంగ్రెస్‌ ప్రముఖులలో జి.రాజారాం, ఎమ్‌.ఎన్‌.లక్ష్మీనరసయ్య, కళ్యాణి రామచంద్రరావు ఉండగా, సీపీఐ నుంచి బి.ధర్మబిక్షం గెలుపొందారు. కాగా మున్నూరు కాపు, ముదిరాజ్‌ వర్గాల నుంచి ఎక్కువ మంది గెలవడం విశేషం.
ఎస్‌సీలు.. ఇతరులు..
షెడ్యూల్‌ కులాల వారు 19 మంది గెలవగా, వారిలో ఒకరు జనరల్‌ స్థానం నుంచి విజయం సాధించారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ ఎన్నికలను కాంగ్రెస్‌ పార్టీ స్వీప్‌ చేసిందనే చెప్పాలి. 16 చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలిస్తే, కేవలం రెండుచోట్లే సీపీఐ అభ్యర్థి గెలిచారు. ఒకరు ఇండిపెండెంట్‌. కాంగ్రెస్‌ ప్రముఖులలో కోదాటి రాజమల్లు, టీఎన్‌ సదాలక్ష్మి, సిలారపు రాజనరసింహ, అరిగే రామస్వామి, పి.మహేంద్రనాథ్, సుమిత్రాదేవి ప్రభృతులు ఉన్నారు. ఇంకా ఇతర సామాజిక వర్గాలకు చెందిన ప్రముఖులలో.. సీపీఐ ప్రముఖ నేత నల్లమల గిరిప్రసాద్‌ ఖమ్మం నుంచి గెలుపొందారు. ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. వైశ్యులు ముగ్గురు గెలిస్తే వారంతా కాంగ్రెస్‌ పార్టీ నుంచే గెలుపొందారు. అందులో కొత్తూరు సీతయ్య గుప్తా ముఖ్యులని చెప్పాలి. ఎస్టీలు ఇద్దరు కాంగ్రెస్‌ నుంచి విజయం సాధించగా కె.భీమ్‌రావు సీనియర్‌ నేత. పార్శీ వర్గం నుంచి రోడా మిస్త్రి జూబ్లిహిల్స్‌ నియోకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున విజయం సాధించారు.

మజ్లిస్‌కు బీజం..
ముస్లింలు ఏడుగురు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ పక్షాన ఐదుగురు, సీపీఐ నుంచి ఒకరు, ఇండిపెండెంటుగా మరొకరు ఎన్నికయ్యారు. హైదరాబాద్‌ రాజకీయాలలో తనకంటూ ప్రత్యేక స్థానం సాధించుకుని మజ్లిస్‌ పార్టీని విజయపథంలోకి తీసుకువచ్చిన సలావుద్దీన్‌ ఒవైసీ తొలిసారిగా ఫత్తర్‌గట్టి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. అప్పట్లో పాతబస్తీలో అత్యధికంగా కాంగ్రెస్‌ నేతలే గెలుస్తుండేవారు. ఎంఐఎంకి ఈ ఎన్నికలలోనే బీజం పడిందని చెప్పవచ్చు. ఇక, కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన ముస్లిం ప్రముఖులలో ఎమ్‌.ఎమ్‌.హషీం, కమాలుద్దీన్‌ అహ్మద్‌ ఉన్నారు.

‘వందేమాతరం’ అంటే అందరికీ దడే..
1962 ఎన్నికలలో బ్రాహ్మణులు 12 మంది గెలిస్తే, కాంగ్రెస్‌ నుంచి 5, సీపీఐ నుంచి ఇద్దరు, స్వతంత్ర పార్టీ నుంచి ఒకరు, ఇండిపెండెంట్లు 4గురు గెలిచారు. కాంగ్రెస్‌ ప్రముఖులలో పీవీ, లక్ష్మీకాంతరావు, వాసుదేవ కృష్ణాజీ నాయక్, అక్కిరాజు వాసుదేవరావు, హయగ్రీవాచారి ఉన్నారు. సీపీఐ నుంచి గెలిచిన ప్రముఖుల్లో కేఎల్‌ నర్సింహారావు, పర్సా సత్యనారాయణ ఉన్నారు. ఇండిపెండెంట్లలో వందేమాతరం రామచంద్రరావు పేరెన్నిక గన్నవారు. ఈయన కాంగ్రెస్‌ నేతలను గడగడలాడించేవారు. ఎన్నికల పిటిషన్లు వేయడంలో, వారిని అనర్హులను చేయించడంలో దిట్టగా నాటి రోజుల్లో పేరొందారు. 
సామాజిక విశ్లేషణ
కొమ్మినేని శ్రీనివాసరావు 

మరిన్ని వార్తలు