మారిన ముఖచిత్రం

26 Nov, 2018 03:22 IST|Sakshi

1983 ఎన్నికలు: రెండు పార్టీల వ్యవస్థకు పునాది 

తెలుగుదేశ పార్టీ ఆవిర్భావం 

రెడ్లదే ఆధిపత్యం..తెలంగాణలో కాంగ్రెస్‌ హవా

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో 1983 ఎన్నికలు పెనుమార్పులకు మూలమయ్యాయి. ఇక్కడి రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేశాయి. రెండు పార్టీల వ్యవస్థకు బలమైన పునాది ఈ ఎన్నికలలో పడింది. కొన్నిసార్లు చీలినా మూడు దశాబ్దాల పాటు ఏపీని పాలించిన కాంగ్రెస్‌ పార్టీ మొదటిసారిగా పరాజయం పాలైంది. ప్రఖ్యాత నటుడు ఎన్‌.టి.రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. అయితే తెలంగాణలో మెజార్టీ సీట్లను ఆయన పొందలేకపోవడం విశేషం. కాంగ్రెస్, ఇతర పక్షాలకు వచ్చిన సీట్లన్నిటిని కలిపితే, టీడీపీకి తక్కువ సీట్లు వచ్చినట్లు లెక్క. ఆ ఎన్నికలలో తెలంగాణలో మొత్తం 107 స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీకి 43 సీట్లు మాత్రమే వచ్చాయి. వీరిలో 39 మంది కొత్తవారు, మొదటిసారి శాసనసభకు ఎన్నికైన వారు కావడం మరో ప్రత్యేకత. కాంగ్రెస్‌ పక్షాన 43 మంది గెలుపొందారు. బీజేపీకి రెండు, సీపీఐకి నాలుగు, సీపీఎంకు రెండు, జనతా పార్టీకి ఒకటి, ఇండిపెండెంట్లు పది మంది గెలుచుకున్నారు.

సామాజిక వర్గాల వారిగా చూస్తే మొత్తం 34 మంది రెడ్లు విజయం సాధించగా, వారిలో 14 మంది కాంగ్రెస్, పన్నెండు మంది టీడీపీ, ఇద్దరు బీజేపీ, ఇద్దరు సీపీఎం, ఒకరు జనతా, ముగ్గురు ఇండిపెండెంట్లు ఉన్నారు. కమ్మ వర్గం వారు ఏడుగురు గెలవగా వారంతా తెలుగుదేశం పక్షానే గెలిచారు. వెలమ సామాజికవర్గం వారు ఎనిమిది మంది గెలవగా వారిలో నలుగురు కాగ్రెస్, నలుగురు టిడిపి తరపున నెగ్గారు. ఎస్సీలలో ఎనిమిది మంది కాంగ్రెస్, ఏడుగురు టీడీపీ, ఇద్దరు సీపీఐ పక్షాన గెలిచారు. ఎస్టీలలో నలుగురు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఇండిపెండెంట్లు ఒక్కొక్కరు చొప్పున గెలిచారు. జనరల్‌ సీటు బాన్స్‌ వాడ నుంచి టీడీపీ తరపున ఒక ఎస్‌టీ అభ్యర్థి గెలిచారు. బీసీలలో తొమ్మిది మంది కాంగ్రెస్, ఏడుగురు టీడీపీ, ఒకరు ఇండిపెండెంట్‌గా నెగ్గారు. ముస్లింలలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐల తరుపున ఒక్కొక్కరు గెలవగా, ఐదుగురు ఇండిపెండెంట్లు నెగ్గారు.  
రెడ్డి వర్గం నుంచి.. 
రెడ్డి సామాజికవర్గం నుంచి 34 మంది గెలిస్తే కాంగ్రెస్‌ నుంచే ఎక్కువ మంది గెలిచారు. టీడీపీ తరపున గెలిచిన రెడ్డి ప్రముఖులలో జానారెడ్డి ఒకరు. కాంగ్రెస్‌ నుంచి ఎం.బాగారెడ్డి, ఆర్‌.సురేంద్రరెడ్డి, శీలం సిద్ధారెడ్డి, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, టి.అంజయ్య, బీజేపీ నుంచి నల్లు ఇంద్రసేనారెడ్డి, చందుపట్ల జంగారెడ్డి ఉండగా, జనతా పార్టీ పక్షాన ఎస్‌.జైపాల్‌ రెడ్డి గెలుపొందారు. సీపీఎం నుంచి నర్రా రాఘవరెడ్డి, మల్లు స్వరాజ్యం ఉన్నారు. ఇండిపెండెంటుగా గెలిచినవారిలో పి.రామచంద్రారెడ్డి ఉన్నారు. 

వెలమ.. 
వెలమ సామాజికవర్గం నుంచి తెలుగుదేశం పక్షాన కొత్తవారు గెలిస్తే, కాంగ్రెస్‌ పార్టీ తరపున పాత తరం నేతలు గెలిచారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచినవారిలో ఎన్‌.యతిరాజారావు, జలగం ప్రసాదరావు వంటి నేతలు ఉన్నారు. టీడీపీ,  కాంగ్రెస్‌ నుంచి నలుగురు చొప్పున గెలిచారు. 

అందరూ టీడీపీ వారే.. 
తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత కమ్మ సామాజికవర్గం ఆ పార్టీని  సొంత పార్టీగా భావించడం ఆరంభించింది. దానికి తగినట్లే తెలంగాణలో అత్యధికంగా ఏడుగురు కమ్మనేతలు ఎన్నికైతే వారంతా టీడీపీ నుంచి గెలవడం విశేషం. ఏడుగురిలో ఒక్క టి.రజనీబాబు తప్ప మిగిలిన వారంతా రాజకీయంగా కొత్తవారని చెప్పాలి. ఏడుగురు తొలిసారి ఎన్నికయ్యారు. 

బ్రాహ్మణ వర్గం.. 
బ్రాహ్మణ వర్గం నుంచి ఏడుగురు గెలిస్తే, ముగ్గురు కాంగ్రెస్, ముగ్గురు టీడీపీ వారు.ఒకరు సీపీఎం నుంచి గెలిచారు. టీడీపీ నుంచి గెలిచినవారిలో కరణం రామచంద్రరావు ప్రముఖులు. కాంగ్రెస్‌లో చకిలం శ్రీనివాసరావు, బొప్పరాజు లక్ష్మీకాంతరావు, డి.శ్రీపాదరావు గెలిచారు. సీపీఎం నేత మంచికంటి రామకిషన్‌ రావు గెలుపొందారు. 

ముస్లింలు 8 మంది.. 
హైదరాబాద్‌ పాతబస్తీ నుంచి అత్యధికంగా ఐదుగురు ముస్లిం నేతలు గెలిచారు. వారంతా మజ్లిస్‌ పక్షంవారే. సలావుద్దీన్‌ ఒవైసీ నాయకత్వంలో వారు ఉండేవారు. సీపీఐ నుంచి మహ్మద్‌ రజబ్‌ అలీ గెలిచారు. 

బీసీలు 17 మంది ..
వెనుకబడిన తరగతుల వారిలో కాంగ్రెస్‌ నుంచి తొమ్మిది మంది, టీడీపీ నుంచి ఏడుగురు, సీపీఎం నుంచి ఒకరు గెలుపొందారు. టీడీపీ తెలంగాణలో బీసీలపై పట్టు సాధించలేకపోయింది. మున్నూరుకాపు, గౌడ, ముదిరాజ్‌ వర్గాల నుంచే ఎక్కువ మంది గెలిచారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ప్రముఖులలో సి.జగన్నాథరావు, మాణిక్‌ రావు, మదన్‌ మోహన్‌ వంటి ప్రముఖులు ఉన్నారు. బీసీల నుంచి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలంతా తొలిసారి గెలిచినవారే. సీపీఎం నేత ఓంకార్‌ కూడా బీసీ నేతే. 

ఎస్సీల్లో కాంగ్రెస్‌ వారే అధికం 
ఎస్సీల్లో కూడా కాంగ్రెస్‌ వారే ఎక్కువ మంది గెలిచారు. 8 మంది కాంగ్రెస్, ఏడుగురు టీడీపీ నుంచి గెలిచారు. టీడీపీలో గెలిచిన వారిలో పుట్టపాగ మహేంద్రనాథ్‌ తప్ప మిగిలినవారంతా కొతవారే. కాగా కాంగ్రెస్‌లో గోకా రామస్వామి, పి.శంకరరావు ఉన్నారు.
సామాజిక విశ్లేషణ
కొమ్మినేని శ్రీనివాసరావు 

మరిన్ని వార్తలు