అమరావతిలో మూడు రోడ్లు, ఆరు బిల్డింగ్‌లే!

9 Sep, 2019 04:44 IST|Sakshi

కాంట్రాక్టర్లకు రూ.24,600 కోట్ల బకాయిలు

అవి చెల్లించకుండానే మరో రూ.20 వేల కోట్ల పనులకు టెండర్లు

డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి

తెనాలి: అమరావతి అనే మహానగరంలో ఉన్నది కేవలం మూడు రోడ్లు, ఆరు బిల్డింగులు మాత్రమేనని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి చెప్పారు. ఎంతో అనుభవం కలిగిన మాజీ ముఖ్యమంత్రి రాజధానిలో చేయించిన పనుల్లో రూ.24,600 కోట్ల మేర కాంట్రాక్టర్లకు అప్పు మిగిల్చి వెళ్లారన్నారు. మరో రూ.20 వేల కోట్ల కొత్త పనులకు టెండర్లు పిలిచారని చెప్పారు. గుంటూరు జిల్లా తెనాలిలో బ్రాహ్మణ పరిషత్‌ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఎన్‌ఆర్‌కే కళ్యాణమండపంలో విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తెనాలి, వేమూరు ఎమ్మెల్యేలు అన్నాబత్తుని శివకుమార్, డాక్టర్‌ మేరుగ నాగార్జునకు జరిగిన అభినందన సభకు పరిషత్‌ అధ్యక్షుడు పరాశరం రామగోపాల్‌ అధ్యక్షత వహించారు.

కోన రఘుపతి మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రతి హామీ అమలుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిబద్ధతతో కృషిచేస్తుంటే.. ప్రతిపక్షం అవాస్తవాలు మాట్లాడుతుండటం విచారకరమన్నారు. రాజధాని పనులపై ’కాగ్‌’ నివేదికల్లో వెల్లడైన అవకతవకలు, బీజేపీ చేసిన ప్రస్తావనలను బాధ్యత గల సీఎంగా వైఎస్‌ జగన్‌ వాటన్నిటినీ పరిశీలించి ముందుకెళ్లాలా? వద్దా? అని ప్రశ్నించారు. బ్రాహ్మణ అధ్యయన కమిటీ సభ్యుడు పోతావఝల పురుషోత్తమశర్మ స్వాగతం పలికిన సభలో జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రావూరి ఆంజనేయులు, సుప్రీం కోర్టు న్యాయవాది వరప్రసాద్, ఎన్‌ఆర్‌కే శర్మ మాట్లాడారు. 

మరిన్ని వార్తలు