సిరుల కోనసీమా.. నీకెన్ని కష్టాలమ్మా!

20 Jun, 2018 18:43 IST|Sakshi

సాక్షి, రాజోలు: ‘‘బయటి ప్రపంచానికి కోనసీమ అంటే చాలా సిరిసంపదలున్న ప్రాంతంగా అనిపిస్తుంది. కానీ గడిచిన నాలుగేళ్లుగా చంద్రబాబు దుర్మార్గ పాలనలో ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న కష్టాలు చూస్తే గుండె తరుక్కుపోతుంది. గోదావరి ప్రవహించే ఈ గడ్డపై మంచినీళ్ల కోసం జనం ఇక్కట్లు పడుతున్నారు. వరికి కనీసమద్దతు ధర దొరకడంలేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొబ్బరి ధర 4వేల రూపాయలు పడిపోయింది. బోరు వేస్తే ఉప్పునీళ్లు, లేదంటే ఆయిల్‌ కంపెనీల కారణంగా కలుషితమైన నీరు వస్తుంది. కోనసీమ దాహార్తిని తీర్చేందుకు దివంగత మహానేత వైఎస్సార్‌ ప్రారంభించిన నీటిశుద్ధి కేంద్రాలను ప్రభుత్వం సరిగా నిర్వహించడంలేదు. సంపదగల ఈ ప్రాంతం నుంచే చాలా మంది ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లారు. దేశంకాని దేశంలో ఘోరమైన కష్టాలు అనుభవిస్తోన్న వారిని ఇక్కడి ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలులేవు. ఈ ప్రాంతానికి పట్టిన చంద్రబాబు పీడ విరగడయ్యేరోజులు దగ్గర్లోనే ఉన్నాయి. జనం ఆశీర్వాదంతో రాబోయే ప్రజా ప్రభుత్వంలో కోనసీమకు తిరిగి జీవం పోస్తామని మాటిస్తున్నా..’’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. 194వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

దళారీల నాయకుడు చంద్రబాబు: ధాన్యం పండిచే రైతులు, కొబ్బరి రైతులు, తమలపాకు రైతులు, సరుగుడు సాగుదారులు... ఎవర్ని కసిలినా కష్టాలు, కన్నీళ్లే. ఇక కూలీల పరిస్థితైతే ఇంకా దారుణం. గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. కోనసీమలో రబీ పంటకు సాగునీరు లేదు. సరే, ఏదోరకంగా కాపాడుకుని పంటను మార్కెట్‌కు తీసుకొస్తే కనీస మద్దతు ధర దొకదు. ధాన్యం దళారీలపాలైపోయిన తర్వాతగానీ కొనుగోలు కేంద్రాలను తెరవడు ఈ ముఖ్యమంత్రి. దళారీలకు పెద్ద నాయకుడు చంద్రబాబు కాబట్టే రైతులు, పేదల కష్టాలు రెట్టింపు అయ్యాయి. నాలుగేళ్ల పాటు ప్రజల కష్టాలు పట్టించుకోకుండా.. ఇంకో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయని పట్టించుకున్నట్లు నటించడం మొదలుపెట్టాడు. ఈయన తీరు చూస్తుంటే నాకొక కథ గుర్తుకొస్తోంది...

సార్‌.. టైమిస్తే స్టేట్‌ ఫస్టొస్తా!: అనగనగా ఒక విద్యార్థి ఉన్నాడు.. ఈ చంద్రబాబు మాదిరి. ఆ విద్యార్థి వార్షిక పరీక్షలు రాయడానికి వెళ్లాడు. మూడు గంటల పరీక్షలో రెండున్నర గంటలు ఏమీ రాయకుండా కూర్చున్నాడు. తీరా పరీక్ష సమయం దగ్గరపడుతుందనగా, మాస్టారు దగ్గరికొచ్చి.. ‘సార్‌.. నాకు ఇంకో మూడు గంటలు టైమివ్వండి పరీక్ష రాస్తాను’ అన్నాడు. విద్యార్థి తీరుకు విస్తుపోయిన మాస్టారు.. ‘మరి ఇంతసేపు ఏం చేశావయ్యా!’ అని నిలదీస్తాడు. అప్పుడా విద్యార్థి.. ‘సార్‌, మీరు నెల టైమిస్తే స్టేట్‌ ఫస్ట్‌ వస్తా, ఐదు నెలలు టైమిస్తే ప్రపంచంలోనే ఫస్టొస్తా..’ అని చెబుతాడు.. 2020 కల్లా దేశంలో, 2050 కల్లా ప్రపంచంలో ఏపీని నంబర్‌ వన్‌ చేస్తానంటున్న చంద్రబాబు ఈ కథలోని విద్యార్థి అయితే, మాస్టారుగా ఆయన్ని నిలదీసేది ప్రజలు.

బాబు చేతిలో మోసపోనివారు లేరు: రైతు రుణాల మాఫీ, డ్వాక్రా పొదుపు సంఘాల రుణాల మాఫీ, ఇంటికొక ఉద్యోగం, నిరుద్యోగ భృతి, కులానికో పేజీ చొప్పున అన్ని కులాలకు మేలు... అంటూ పెద్ద ఎత్తున హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. వాటిలో ఏఒక్కదానినైనా నెరవేర్చాడా? కాపులకు రిజర్వేషన్‌ ఇస్తానన్నది ఈయనే కదా, ఆ విషయం అడిగితే వాళ్లను తిడతాడు, రిజర్వేషన్‌ అడిగిన మత్స్యకారుల తాటతీస్తానంటాడు, న్యాయం చేయమని వచ్చిన నాయీ బ్రహాహ్మణులనేమో తొకలు కత్తిరిస్తానని బెదిరిస్తాడు. అసలు ఇలాంటి వాడు మనిషేనా, ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఉన్నదా అని అడుగుతున్నాను..

అయ్యయ్యో మీకు ఏమీ రావట్లేదా?: నాలుగేళ్లూ కళ్లుమూసుకున్న చంద్రబాబు ఆరునెల్లో ఎన్నికలుండటంతో కపటనాటకాలు మొదలుపెట్టాడు. అయ్యయ్యో.. మీకు పెన్షన్లు రావట్లేదా, రేషన్‌ కార్డులు లేవా.. మీకు బియ్యం రావట్లేదా.. ఆగండి.. ఇప్పుడే ఆఫీసర్లకు ఆర్డర్‌ ఇస్తా.. అంటాడు. ఇళ్ల స్థలాల కోసం కోట్లు కుమ్మరిస్తున్నానంటాడు. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు అన్నా క్యాంటీన్లు, రెండు రూపాలయలకే మంచినీరు, ఆక్వా రైతుల కోసం ఏదో చేసినట్లు బిల్డప్‌ ఇస్తాడు. విభజన హామీలు చేయలేదు కాబట్టి ఎన్టీఏ నుంచి బయటికొస్తా అంటాడు. అయ్యయ్యో.. ప్రత్యేక హోదా రాలేదా, మోదీతో పోరాడుతా.. అని ఢిల్లీకి పోయి మోదీ ముందు వంగివంగి సలామ్‌లు చేస్తాడు..

ఈ మోసకారిని క్షమించొద్దు: ఈ చెడిపోయిన వ్యవస్థ మారాలంటే ప్రజలందరూ సహకరించాలి. ఒక నాయకుడు మాట చెప్పి, దాన్ని నెరవేర్చని పక్షంలో రాజీనామాచేసే రోజులు రావాలి. పొరపాటునగానీ ఈ దుర్మార్గ చంద్రబాబును క్షమిస్తే, మరిన్ని ఆకర్షణలతో ప్రజలముందుకొస్తాడు. ఇంటికో కేజీ బంగారం, బెంజ్‌ కారు ఇస్తానంటాడు. ఓటుకు మూడు వేలు చొప్పున కొనే ప్రయత్నం చేస్తాడు. అతను ఇచ్చేవి తీసుకున్నా పర్లేదుగానీ, ఓటు మాత్రం మీ మనస్సాక్షిని అనుసరించి వేయండి. మోసగాళ్లు, అవినీతిపరులు మనకు నాయకులుగా ఉండటం శ్రేయస్కరంకాదని గుర్తించాలి...

డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తాం‌: దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో మన ప్రజా ప్రభుత్వం ఏర్పడితే ఏమేం చేస్తామన్నది నవరత్నాల ద్వారా వివరించాం. ఈ రోజు డ్వాక్రా మహిళల కోసం ఏమేం చేయబోతున్నామో మరోసారి గుర్తుచేసుకుందాం.... ఎన్నికల నాటికి ఎంతైతే బ్యాంకుల్లో అప్పు ఉంటుందో ఆ అప్పంతా నేరుగా అక్కచెల్లెమ్మలకే నాలుగు దఫాలుగా ఇస్తాం. వడ్డీ లేకుండా రుణాలు అందిస్తాం. ఆ వడ్డీని ప్రభుత్వమే చెల్లించే ఏర్పాట్లు చేస్తాం. గతంలో మహానేత వైఎస్సార్‌ రాష్ట్రంలో 48 లక్షల ఇళ్లు కట్టించారు. ఆయన బాటలోనే ఇంకా ఇల్లులేని ప్రతి పేదకూ పక్కా ఇల్లు కట్టిస్తానని మాటిస్తున్నా. ఆ ఇల్లు అక్కచెల్లెమ్మ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయిస్తాను. ఎప్పుడైనా హఠాత్తుగా డబ్బు అవసరమైతే, నేరుగా బ్యాంకు వెళ్లి ఇంటిపై పావలా వడ్డీకే రుణం తీసుకునే సదుపాయాన్ని కల్పిస్తాం. మనం అధికారంలోకి వచ్చాక విడదలవారీగా మద్యనిషేధాన్ని అమలులోకి తెచ్చుకుందాం. ఈ చెడిపోయిన వ్యవస్థను మార్చేందుకు పాదయాత్రగా బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటున్నా...’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

మరిన్ని వార్తలు