కొండా సురేఖ వర్సస్‌ నన్నపునేని..

22 Jul, 2018 08:15 IST|Sakshi
ఎమ్మెల్యే కొండా సురేఖ, మేయర్‌ నన్నపునేని నరేందర్‌

టీఆర్‌ఎస్‌ పార్టీలో ఆధిపత్య పోరు

కొండా వర్సెస్‌ నన్నపునేని జగడం

భూపాలపల్లి, మహబూబాబాద్,  డోర్నకల్, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గాలోనూ ఇదే పరిస్థితి

పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు కరువు

సాక్షి, వరంగల్‌ రూరల్‌: వరంగల్‌ నగరంలోని ఇక్బాల్‌ మినార్‌ కూల్చివేత వ్యవహారంతో అధికార పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఇంతకాలం చాప కింద నీరులా విస్తరిస్తున్న అసమ్మతి, ఆధిపత్య పోరు బయటపడ్డాయి. అధికార పార్టీకి చెందిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో అధికార పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరగా భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్, స్టేషన్‌ ఘన్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇదే తరహా పరిస్థితి ఉంది. ఉద్యమ కాలం నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధన, తొలి ప్రభుత్వం ఏర్పాటు వరకు టీఆర్‌ఎస్‌కు ఉమ్మడి వరంగల్‌ జిల్లా వెన్నుదన్నుగా నిలిచింది. తెలంగాణ ఉద్యమ సమయంలో జాయింట్‌ యాక్షన్‌ కమిటీల ఏర్పాటు ఈ జిల్లా నుంచే మొదలైంది. ప్రస్తుతం ఇందుకు విరుద్ధంగా అధికార పార్టీ నేతల మధ్యే వర్గపోరు పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది.

కొండా వర్సస్‌ నన్నపునేని..
వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కొండా సురేఖ, మేయర్‌ నన్నపునేని నరేందర్‌ మధ్య గత రెండేళ్లుగా వర్గపోరు నడుస్తోంది. కొంతకాలం వారి మధ్య విభేదాలు సమసిపోయినట్లు కనిపించినా, గత ఆరు నెలలుగా ఇవి పరస్పర ఆరోపణలు, దూషణల వరకు వెళ్లాయి. ముఖ్యంగా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్, రంజాన్‌ ఇఫ్తార్‌ విందులు వీరి మధ్య పొలిటికల్‌  హీట్‌ను మరింత పెంచాయి. ఇరువర్గాలకు చెందిన అనుచరులు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించి బలప్రదర్శన చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు ఆ దశను దాటి ఏకంగా ఎదుటి వర్గంపై బాహటంగా విమర్శలు చేసే స్థాయికి విభేదాలు చేరుకున్నాయి. వరంగల్‌ పోచమ్మమైదాన్‌లో ఇక్బాల్‌ మినార్‌ను కూల్చివేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి వరకు రోడ్డుపై ఎమ్మెల్యే కొండా సురేఖ ఆధ్వర్యంలో బైఠాయించారు.

మరుసటి రోజు వరంగల్‌లోని ఓ గార్డెన్‌లో ముస్లిం నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ‘మేయర్‌ నరేందర్‌ నువ్వో బచ్చా’ అంటూ నేరుగా ఎమ్మెల్యే ఎదురుదాడికి దిగారు. శనివారం గ్రేటర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయంలో మేయర్‌ నరేందర్‌ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ 2014లో తాను త్యాగం చేస్తే నే సురేఖకు టికెట్‌ వచ్చిందని, సీఎం కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు నష్టం చేకూర్చితే నరసింహా అవతారం ఎత్తుతానని స్వరం పెంచారు. ఇదిలా ఉండగా మరోవైపు  కొండా కుటుంబం నుంచి తమకు ప్రాణ హానీ ఉందని, తమకు రక్షణ కల్పిం చాలంటూ ఈ నెల 20న 15 డివిజన్‌ కార్పొరేటర్‌ శారదజోషి  నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కొండా, నన్నపునేని మధ్య వర్గ పోరు తారాస్థాయికి చేరినా ఇప్పటి వరకు పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.
 
మరో నాలుగు నియోజకవర్గాల్లో ఇదే తీరు..
మహబూబాబాద్‌ నియోజకవర్గం పరిధిలో ప్రస్తు త ఎమ్మెల్యే శంకర్‌నాయక్, మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత మధ్య గత మూడేళ్లుగా వర్గపోరు నడుస్తోంది. కవిత పార్టీకి వచ్చిన కొత్తలోనే ఆమె రాకను వ్యతిరేకిస్తూ శంకర్‌నాయక్‌ ఘాటైన వ్యా ఖ్యలు చేశారు. దీనిపై పార్టీ పెద్దలు ఎమ్మెల్యేను వివరణ అడిగారు. అయినా అక్కడి పరిస్థితిలో మార్పు రాలేదు. పార్టీపరంగా ఇరువర్గాలు వేర్వేరుగానే కార్యక్రమాలు చేపడుతున్నాయి. 
భూపాలపల్లి నియోజకవర్గంలో విచిత్రంగా త్రిముఖ పోరు నెలకొంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే స్పీకర్‌ మధుసూదనాచారి ఉండగా గండ్ర సత్యనారాయణరావు టిక్కెట్‌ హామీతో పార్టీ చేరినట్లు ప్రచారం జరిగింది. వారిలో టిక్కెట్‌ ఎవరికి దక్కుతుందో అనే ఊగిసలాట కొనసాగుతుండగానే భూపాలపల్లి టికెట్‌ కొండా సుస్మిత పటేల్‌కే అంటూ కొండా దంపతులు ప్రకటించడం సంచలనంగా మారింది.
 
స్టేషన్‌ఘన్‌పూర్‌లో తొలుత కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యకు చెందిన అనుచరుల మధ్య కొంతకాలం వర్గపోరు నడిచింది. ఆ తర్వాత అంతా సద్దుమణిగిన తర్వాత తెరపైకి రాజాçరపు ప్రతాప్‌ వచ్చారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యేకు పోటీగా రాజారపు ప్రతాప్‌ కార్యక్రమాలు చేపట్టడంపై రాజయ్య వర్గం ఫైర్‌ అవుతోంది. ఒకటి తర్వాత ఒకటిగా గ్రూపు రాజకీయాలు, వర్గపోరు బహిర్గతమవుతున్నా పార్టీపరంగా అధిష్ఠానం ఎలాంటి క్రమశిక్షణ చర్యలు చేపట్టడం లేదు. దీంతో ఈ వర్గపోరు ఎక్కడి వరకు వెళ్తుందనేది ఆసక్తిగా మారింది.

మరిన్ని వార్తలు