ఎర్రబెల్లి కోసం జూపల్లిని ఓడగొట్టారు : కొండా దంపతులు

22 Dec, 2018 12:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎర్రబెల్లి దయాకర్‌ రావును మంత్రిని చేయడం కోసమే మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావును ఓడగొట్టారని కొండా దంపతులు ఆరోపించారు. శనివారం కొండా మురళి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన తన సతీమణి, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖతో శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ను కలిసారు. తన రాజీనామా పత్రాన్ని ఆయనకు అందజేసిన కొండా మురళి అనంతరం మీడియాతో మాట్లాడారు. 

‘ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాను. టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నప్పటికి నామీద గౌరవంతో బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు బరిలో నిలవలేదు. వారందరికి కృతజ్ఞతలు. రాష్ట్రంలో తొలిసారి నేను ఏకగ్రీవంగా గెలిచాను. విలువలు పాటిస్తున్న నాయకుడిని కాబట్టే రాజీనామా చేశాను. ప్రతిపక్షమే లేకుండా చేయాలని కేసీఆర్ చూస్తున్నారు. నేను, సురేఖ రాజకీయవిలువలతో ప్రజల మధ్య బతుకుతున్నాం. మాకు పదవులు ముఖ్యం కాదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి ఆకస్మిక మరణానంతరం మూడు నెలలకే ఎమ్మెల్సీ, మంత్రి పదవులకు రాజీనామా చేశాం. మాకు పదవులు కాదు ఆత్మాభిమానమే ముఖ్యం. ఆత్మాభిమానం చంపుకున్నోళ్లే టీఆర్ఎస్‌లో చేరుతారు. మొదట మంచిగా మాట్లాడుతారు. భోజనం పెడతరు తర్వాత నాలుగేళ్లు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వరు. 30 ఏళ్లుగా మాకు శత్రువుగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌ రావును టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం మాకు నచ్చలేదు. ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని చూస్తున్నారు. దొరల పాలనను ప్రతిఘటించి ప్రజల మధ్య ఉండి పోరాడుతాం’ అని కొండా మురళి స్పష్టం చేశారు. 

అధికార దుర్వినియోగంతోనే టీఆర్‌ఎస్‌ గెలిచింది: కొండా సురేఖ
‘స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖ అందించాం. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే రాజీనామా చేయాలని ముందే అనుకున్నాం. కేసీఆర్ ఇచ్చిన బీ ఫార్మ్ మీద మురళీ గెలవలేదు. ప్రజల అండతోనే మురళి ఎమ్మెల్సీగా గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో అధికార దుర్వినియోగంతో టీఆర్ఎస్ గెలిచింది. మాట్లాడే వాళ్ళని అసెంబ్లీలోకి రాకుండా చేసిన కేసీఆర్.. మా లాంటి వారి నియోజకవర్గాల్లో గెలుపు కోసం రూ.50 కోట్లు ఖర్చు చేశారు. కౌన్సిల్ లో ప్రతిపక్షం లేకుండా విలీనం చేసుకోవాలని చూడటం ప్రజాస్వామ్యం ఖూనీ చేయటమే. వ్యక్తుల ద్వారా పదవులకు వన్నె రావాలి కానీ మేము పదవుల కోసం పాకులాడే వాళ్ళం కాదు. దయాకర్‌కు మంత్రి పదవి కోసం జూపల్లిని ఓడగొట్టారు. ప్రజాస్వామ్య పద్దతిలో పాలన చేయండి. కుటుంబ పెత్తనం పక్కన పెట్టి ప్రజా క్షేమం మీద దృష్టి పెట్టాలి. గతంలో పార్టీలు మారిన వారి మీద ఎలాంటి చర్యలు లేవు. వాళ్ళది అనుకున్న పదవి మాకు అవసరం లేదు.. కావున రాజీనామా చేశాం. ఏదైనా ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటాం’ అని కొండా సురేఖ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు