కొండా విశ్వేశ్వరరెడ్డికి స్వల్ప ఊరట

29 Apr, 2019 16:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట కలిగింది. పోలీసులను నిర్బధించిన కేసులో ముందస్తు బెయిల్‌ కోసం విశ్వేశ్వరరెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. అంతేకాకుండా రూ. 25వేలతో కూడిన రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. 41ఏ సీఆర్‌పీసీ ప్రకారం నోటీసులు అందుకున్న తరువాత పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది.

పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి సన్నిహితుడు సందీప్‌ రెడ్డి వద్ద పది లక్షల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు బంజారాహిల్స్‌లోని విశ్వేశ్వరరెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో కొండా అనుచరులు ఎస్సై, హెడ్ కానిస్టేబుల్‌ను నిర్భందించారు. దీంతో వారు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కారణంగా పలు సెక్షన్ల కింద విశ్వేశ్వరరెడ్డిపై కేసు నమోదైంది. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన విశ్వేశ్వరరెడ్డి తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాల్సిందిగా నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. అయితే నాంపల్లి కోర్టు ఆ పిటిషన్‌ను తిరిస్కరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్నందుకే పోలీసులు తనపై కావాలనే తప్పుడు కేసు నమోదు చేశారని విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు.

మరిన్ని వార్తలు