‘మంత్రి స్పందించడం ఆనందంగా ఉంది’

8 Jul, 2020 20:35 IST|Sakshi

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌తో పోరాడుతున్న జర్నలిస్టు సిద్ధిరెడ్డి శ్రీనివాస్‌ ఆవేదన సోషల్‌ మీడియాలో వైరల్‌ మారిన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళితే..  కరోనాతో చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌ తన ఆరోగ్య పరిస్థితిపై‌ ఓ వీడియోను షేర్‌ చేశారు. అందులో తన ఆరోగ్య పరిస్థితి ఏం బాగోలేదని.. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిందని కన్నీరు పెట్టారు. దయచేసి తనను అపోలో ఆస్పత్రిలో చేర్పించాలని మంత్రి హరీశ్‌రావును కోరారు. కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకుంటున్నారని.. అపోలో ఆస్పత్రిలో చికిత్స అందించాలని విజ్ఞప్తి చేశారు. చికిత్సకు తానే డబ్బులు భరిస్తానని చెప్పారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను షేర్‌ చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. అతని సమస్యపై హరీశ్‌రావు స్పందించడం ఆనందంగా ఉందన్నారు. 

‘ఈ వీడియోను నాకు ఒక జర్నలిస్టు మిత్రుడు పంపించాడు. కానీ అప్పటికే మంత్రి హరీశ్‌రావు అతన్ని యశోద ఆస్పత్రిలో చేర్పించారని తెలిసింది. ఈ వీడియో అతనికి సాయం అందేలా చేసింది. మంత్రి స్పందించడం నాకు ఆనందం కలిగించింది. శ్రీనివాస్‌ త్వరలో కోలుకోవాలి’ అని విశ్వేశ్వరరెడ్డి ఆకాంక్షించారు. 

శాపాల నుంచి ఎవరు కాపాడలేరు..
మరోవైపు, సచివాలయం కూల్చివేతకు సంబంధించి సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లపై విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా బాధితుడి శరీరాన్ని కుక్కలు తింటున్నాయని.. ఇంతకంటే సిగ్గుపడే అంశం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. ఇదేనా మీ బంగారు తెలంగాణ అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. చనిపోతున్న ప్రజల శాపాల నుంచి వాస్తు, యాగాలు, జ్యోతిష్యులు వారిని కాపాడలేరని వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు