‘నేరెళ్ల ఘటనపై కాంగ్రెస్‌ కృత్రిమ రాజకీయం’

21 Jul, 2018 02:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా ఏడాది క్రితం జరిగిన నేరెళ్ల ఘటనపై కాంగ్రెస్‌ పార్టీ పనిగట్టుకుని, కృత్రిమ రాజకీయం చేస్తోందని ప్రభుత్వ చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు. అబద్ధాల పునాదుల మీద ఆందోళనలు చేయాలనుకుని, మంత్రి కేటీఆర్‌పై బట్టకాల్చి మీదేసే విధంగా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ చేస్తున్న రాజకీయాలు శవాలపై పేలాలు ఏరుకుంటున్నట్టుగా ఉందన్నారు. కేటీఆర్‌కు ఎలాంటి సంబంధం లేని నేరెళ్ల ఘటనను అడ్డంపెట్టుకుని నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

శాంతిభద్రతలకు సంబంధించిన అంశాన్ని కాంగ్రెస్‌ పార్టీ రాజకీయం చేస్తూ, ఓటుబ్యాంకు స్వార్థ రాజకీయాలకు తమను వాడుకుంటున్నదని దళితులు, నేరెళ్ల బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇసుక మాఫియాను కేటీఆర్‌కు అంటగట్టడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్‌ హయాంలోనే ఇసుకమాఫియాను పెంచి పోషించారని, 23 జిల్లాల ఉమ్మడి రాష్ట్రంలోనే రూ.10 కోట్లు ఖజానాకు రాలేదన్నారు. తెలంగాణ ఇసుక పాలసీ దేశానికి ఆదర్శంగా నిలిచిందని వివరించారు.

మరిన్ని వార్తలు