కేటీఆర్‌ సీఎం అయితే తప్పేంటి?

6 Jan, 2020 03:05 IST|Sakshi

మీడియాతో ఇష్టాగోష్టిలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ తండ్రికి తగ్గ తనయుడని, ఆయన సీఎం అయితే తప్పేమీ లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అభిప్రాయపడ్డారు. టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆదివారం విలేకరులతో ఇష్టాగోష్టిలో ఆయన మాట్లాడారు. దేశంలో ఏ సీఎం  చేయని పనులు సీఎం కేసీఆర్‌ చేసి తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారన్నారు. తాను అనుకున్న లక్ష్యాలను కూడా ఇప్పటికే చాలా వరకు నెరవేర్చారని, కేసీఆర్‌ ఆలోచనా  విధానం ఏదైనా తాము స్వాగతిస్తామని చెప్పారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ తన సమర్థతను నిరూపించుకున్నారని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీని ఒంటిచేత్తో గెలిపించారని, కేటీఆర్‌ రూపంలో తెలంగాణకు యువనాయకత్వం రావడం హర్షించదగిన పరిణామమని ఆయన అన్నారు.

మున్సిపల్‌ ఎన్నికల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని చెప్పారు. ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌ చావుదెబ్బ తిన్నదని, ఈ ఎన్నికల్లో ప్రజలు అదే తీర్పు ఇస్తారని చెప్పారు. బాధ్యతగల ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించడంలో కాంగ్రెస్‌ విఫలమయిందని, ఓడిపోతామనే భయంతోనే రిజర్వేషన్లు, షెడ్యూల్‌ అంటూ కోర్టులను ఆశ్రయించారన్నారు. బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు గెలిస్తేనే ఆగడం లేదని, ఊహల్లో విహరిస్తోందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ మత ఎజెండాతోనే ముందుకెళుతోందని, హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లోనే బీజేపీ సత్తా ఏంటో తేలిపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. జెడ్పీ ఎన్నికల్లో వంద శాతం స్థానాలు గెలిచామని, ఈ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో విజయం సాధిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో నీచ రాజకీయాలు టీఆర్‌ఎస్‌లో లేవని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల రీడిజైన్‌ ఆపార్టీ నేతలకు అర్థం కావడం లేదని, గోదావరి మీద ఉన్న ప్రాజెక్టుల్లో నీరు పూర్తి సామర్థ్యానికి చేరాయని, కాళేశ్వరం లేకపోతే ఇది సాధ్యపడేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికైనా తీరు మార్చుకుని మతిలేని మాటలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.  

మరిన్ని వార్తలు