ప్రజల తరఫున నిలదీసే బాధ్యత నాది

17 Jul, 2018 13:20 IST|Sakshi
బీవీనగర్‌లో సీసీ రోడ్డు నాణ్యతపై సమాధానం చెప్పాలని అధికారిని నిలదీస్తున్న రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

బీవీనగర్‌లో సీసీ రోడ్డు పరిశీలన

స్థానికులపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు

పగళ్లు వచ్చిన రోడ్డుపై కూర్చొని ఎమ్మెల్యే నిరసన  

నెల్లూరు సిటీ: రోడ్డు పనులు నాణ్యతగా జరగకపోతే ప్రజల తరఫున అధికారులను నిలదీసే బాధ్యత తనదని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మాగుంటలేఅవుట్‌లో తారురోడ్డు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి అధికారులను నిలదీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రూరల్‌ నియోజకవర్గంలోని భక్తవత్సల్‌నగర్‌లో రోడ్డు నిర్మాణం నాసిరకంగా జరిగిందని ప్రజలు ఫోన్‌లు, వాట్సాప్‌ ద్వారా ఎమ్మెల్యేకు తెలియజేశారు. దీంతో సోమవారం ఆయన ఆ ప్రాంతంలో పరిశీలించారు. ఆయనతో పాటు పబ్లిక్‌ హెల్త్‌ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈఈ దేవికలు ఉన్నారు. ఈ క్రమంలో పనులు ఏ విధంగా జరిగాయో స్థానికులు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తెలియజేశారు.

దీంతో బీవీనగర్‌లో రోడ్డు పగుళ్లిచ్చింది వాస్తవమేనని ఈఈ ఒప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.1,100 కోట్లతో భూగర్భ డ్రెయినేజీ, తాగునీటి పథకాల పేరుతో ప్రజల డబ్బును అధికారులు, కాంట్రాక్టర్లు దోచేస్తున్నారని మండిపడ్డారు. బీవీనగర్‌లో రోడ్డు వేసి నెలరోజులు కాకముందే పగుళ్లు వచ్చాయన్నారు. ప్లాట్‌ వైబరేటర్‌ను వినియోగించకుండానే కాంట్రాక్టర్‌లు పనులు చేస్తున్నారని తెలిపారు. బయటినుంచి ట్యాంకర్‌ ద్వారా నీటిని తెచ్చి క్యూరిఫై చేయాలన్నారు. అయితే రోడ్డు వేసి ఒక్కరోజు గడవకముందే దానిపైకి ట్యాంకర్లు తీసుకువచ్చి క్యూరిఫై చేస్తే పగుళ్లు రావా అని అధికారులను అడిగారు. ఎమ్మెల్యే రోడ్డుపైకి వస్తే కానీ పనుల్లో నిబంధనలు పాటించాలని తెలియదా అని ప్రశ్నించారు. రూరల్‌ నియోజకవర్గ పరిధిలో ఎక్కడైనా నాసిరకంగా రోడ్లు, కాలువలు నిర్మిస్తున్నా, అధికారులు స్పందించకపోయినా తనకు ఫోన్‌ చేస్తే గంట వ్యవధిలో మీముందు ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు.

స్థానికులు ఆగ్రహం.. అధికారుల పరుగులు
బీవీనగర్‌లో స్థానికులు పనుల గురించి ఎమ్మెల్యేకు చెబుతుండగా ఈఈ వెంకటేశ్వర్లు స్థానికులపై బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ‘మీకు ఏం తెలుసు?, నువ్వు చూడలేదు, మీరు నన్ను ప్రశ్నించేది ఏంటి’ అని ఎదురుదాడికి దిగారు. దీంతో పలువురు ఒక్కసారిగా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కాంట్రాక్టర్లకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారి అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేయడంతో పలువురు వెంటపడి అడ్డుకున్నారు. ఈక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి కల్పించుకుని ప్రజలు ప్రశ్నించినప్పుడు సమధానం చెప్పాలని, ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈఈని స్థానికులు పగుళ్లు వచ్చిన రోడ్డుపై కూర్చోబెట్టి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే సైతం రోడ్డుపైనే కూర్చున్నారు. అనంతరం పబ్లిక్‌ హెల్త్‌ ఎస్‌ఈ మోహన్‌రావుకు ఎమ్మెల్యే ఫోన్‌ చేసి పరిస్థితి తెలియజేశారు. ఎస్‌ఈ కూడా రోడ్డు నిర్మాణ పనులు నాసిరకంగా జరిగాయని తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం నగరంలో లేనని, రేపు వస్తానని, బిల్లుల చెల్లింపులు నిలిపివేస్తామని, నాణ్యతతో కూడిన రోడ్డును వేస్తామని హామీఇచ్చారు.

కాంట్రాక్టర్‌ జంప్‌
బీవీనగర్‌లో రోడ్డు పనుల పరిశీలనకు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి వస్తున్నారని సమాచారం అందుకున్న కాంట్రాక్టర్, సిబ్బంది పనులను నిలిపివేసి వెళ్లిపోయారు. కోటంరెడ్డి ఎక్కడికి పరిశీలనకు వెళ్తున్న విషయం చివరి వరకు గోప్యంగా ఉంచారు. అయినా కొందరు అధికారులు కాంట్రాక్టర్‌కు చెప్పడంతో పనుల విషయంలో నిలదీస్తారని ఆయన జారుకున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, కార్పొరేషన్‌ విప్‌ బొబ్బల శ్రీనివాసులు యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాలెం సుధీర్‌కుమార్‌రెడ్డి, నాయకులు మురళీకృష్ణ యాదవ్, మొయిళ్ల సురేష్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, దిలీప్‌రెడ్డి, తాళ్లూరు సురేష్‌బాబు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు