బ్రిడ్జి కోసం మురుగు కాలువలో దిగిన ఎమ్మెల్యే

6 Dec, 2018 04:53 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గాంధీగిరి

ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసన 

వరద కాలువపై బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్‌ 

45 రోజుల్లోగా నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పిన అధికారులు

నెల్లూరు (వేదాయపాళెం): ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూడలేక ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఏకంగా తీవ్ర దుర్గంధం వెదజల్లే మురుగు కాల్వలోకి దిగి నిరసన తెలిపారు. వీలైనంత త్వరగా వరద కాలువపై బ్రిడ్జి నిర్మించి ప్రజల సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. గంట పాటు మురుగు కాల్వలోనే నిల్చున్నారు. చివరకు అధికారులు దిగివచ్చి హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలోని 31వ డివిజన్‌ చాణక్యపురి వద్ద ఉన్న వరద కాలవపై బ్రిడ్జి నిర్మించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో స్థానికులు ఈ మార్గంలో రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై స్థానిక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎన్నిసార్లు చెప్పినా ఇరిగేషన్‌ అధికారులు పట్టించుకోలేదు. దీంతో బుధవారం ఆయన నేరుగా ఆ మురుగు కాలువ వద్దకు చేరుకున్నారు.


తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్నా లెక్కచేయకుండా.. నడుములోతు ఉన్న మురుగు నీటిలోకి దిగి నిల్చున్నారు. ఇరిగేషన్‌ అధికారులు వచ్చి సమాధానమిచ్చే వరకు బయటకు రానన్నారు. దాదాపు గంట పాటు ఆ మురుగు నీటిలోనే ఉండిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఇరిగేషన్‌ ఉన్నతాధికారులు.. జేఈ బాలసుబ్రహ్మణ్యాన్ని ఘటనా స్థలికి పంపించారు. పనులను గంట లోపు ప్రారంభిస్తామని.. 45 రోజుల్లోపు బ్రిడ్జి నిర్మిస్తామని ఆయన చెప్పడంతో ఎమ్మెల్యే కాలువలో నుంచి బయటకు వచ్చారు. తమ కోసం మురుగు నీటిలోకి సైతం దిగి నిరసన తెలిపిన ఎమ్మెల్యేను స్థానికులు అభినందించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా