వైఎస్సార్‌సీపీలోకి కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి

27 Jan, 2019 13:04 IST|Sakshi
మాట్లాడుతున్న మాజీ ఎంపీపీ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి

ముక్తకంఠంతో ప్రకటించిన కోట్ల వర్గీయులు 

కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశానికి భారీగా తరలివచ్చిన వైనం 

కోడుమూరు: అందరం జగనన్నకే జై కొడదామని, వైఎస్సార్‌సీపీలో చేరదామని కోట్ల వర్గీయులు ముక్తకంఠంతో ప్రకటించారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సోదరుడు, కోడుమూరు మాజీ ఎంపీపీ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకునేందుకు శనివారం కోడుమూరు పట్టణంలోని స్నేహవినాయక కల్యాణ మండపంలో నిర్వహించిన సమావేశానికి కోడుమూరు, గోనెగండ్ల, దేవనకొండ మండలాల పరిధిలోని కాంగ్రెస్‌ కార్యకర్తలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. జై జగన్‌..జై హర్ష నినాదాలతో కల్యాణ మండపం మార్మోగింది. ముందుగా మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్‌ నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. టీడీపీ దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలను ఎదుర్కొవాలంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడమే సరైనదని స్పష్టం చేశారు.

నా రాజకీయ శత్రువు టీడీపీనే 
రాజకీయంగా శాశ్వత శత్రువుగా ఉన్న టీడీపీతో పొత్తు పెట్టుకొని అనైతిక రాజకీయాలు చేసేందుకు ఆత్మాభిమానం అడ్డురావడంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. జవసత్వాలు లేని కాంగ్రెస్‌ పార్టీలో మనుగడ సాధించలేనని తెలుసుకొని, తనను నమ్ముకున్న కార్యకర్తలు, కోట్ల అభిమానులను కాపాడుకోవాలంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీయే సరైన వేదిక అని ఆ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. ఆలూరు, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లోని కాంగ్రెస్‌ కార్యకర్తలతో సమాలోచనలు జరిపిన అనంతరం ఫిబ్రవరి 6వతేదీన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరుదామన్నారు.

తన సోదరుడు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఇతర పార్టీలతో జతకట్టి రాజకీయాలు చేద్దామన్న విషయాలు తన మనసును నొప్పించాయన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమవుతుందని, అందువల్లే వైఎస్సార్‌సీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నానని తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రఘునాథ్‌రెడ్డి, ప్యాలకుర్తి హర్షవర్దన్‌రెడ్డి, మాజీ సర్పంచు సీబీ లత, సింగిల్‌విండో అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి,  సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు హేమాద్రిరెడ్డి, ఫైనాన్సియర్‌ వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచులు ఈశ్వరరెడ్డి, రామేశ్వరరెడ్డి గంగాధర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, నక్క పరమేష్, మల్లారెడ్డి, తేనేశ్వరరెడ్డి, మాదులు, బోరెల్లి సోమన్న, టెలిఫోన్‌ రాముడు, పుట్టపాశం గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు