ఎస్వీకి ఝలక్‌!

7 Feb, 2019 13:22 IST|Sakshi
ఎస్వీ మోహన్‌రెడ్డి,కోట్ల సుజాతమ్మ

కర్నూలు అసెంబ్లీ తెరపైకి కోట్ల సుజాత

ఆమెకు టికెట్‌ ఇవ్వాలని సీఎం ముందు కేఈ సోదరుల ప్రతిపాదన

డోన్‌ తమకే కేటాయించాలని వినతి

సాక్షి ప్రతినిధి, కర్నూలు:  కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి రాకను ముందుగానే స్వాగతించిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డికి తమదైన శైలిలో ఝలక్‌ ఇచ్చేందుకు కేఈ సోదరులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఏకంగా ఎస్వీ టికెట్‌కే టెండర్‌ వేసేందుకు పావులు కదుపుతున్నారు. కోట్ల కుటుంబానికి కర్నూలు ఎంపీతో పాటు కర్నూలు అసెంబ్లీ టికెట్‌ ఇవ్వాలని టీడీపీ అధిష్టానం ముందు కేఈ సోదరులు కొత్త ప్రతిపాదన చేశారు. పత్తికొండ, డోన్‌ టికెట్లు తమ కుటుంబానికే ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరినట్టు తెలిసింది. గత లోక్‌సభ ఎన్నికల్లో కర్నూలు పరిధిలో కోట్లకు చెప్పుకోదగ్గ ఓట్లు వచ్చిన అంశాన్ని వీరు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

ఇప్పటికే కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో ఉన్న గందరగోళాన్ని తొలగించేందుకు కూడా ఈ పరిణామం దోహదపడడమే కాకుండా ఇక్కడ పార్టీ గెలుపునకు ఉపయోగపడుతుందంటూ అధిష్టానం ముందు ప్రతిపాదన ఉంచనున్నట్టు సమాచారం. కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో ఇప్పటికే ఎమ్మెల్యే ఎస్వీ, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ తనయుడు భరత్‌ మధ్య ఉన్నపోటీని పరిష్కరించే వీలు కూడా కలుగుతుందనేది వీరి అభిప్రాయంగా ఉంది. ఈ నేపథ్యంలో కోట్ల రాకను స్వాగతించిన ఎస్వీకి అసలు సీటే లేకుండా చేయాలనేది కేఈ సోదరుల ప్రణాళికగా ఉన్నట్లు తెలుస్తోంది. 

డోన్, పత్తికొండ మాకే!
జిల్లాలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి,  కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. దీంతో కోట్ల రాకను కేఈ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమతో కనీసం సంప్రదించకుండానే కోట్లతో నేరుగా సీఎం చర్చలు జరపడాన్ని కూడా జీర్ణించుకోలేకపోతోంది. మరోవైపు కర్నూలు ఎంపీతో పాటు ఆలూరు, డోన్‌ టికెట్లు తమకే వస్తాయని కోట్ల కుటుంబం తన అనుచరులతో భేటీ సందర్భంగా చెప్పుకుంటోంది. ఇది కాస్తా కేఈ కుటుంబానికి ఆగ్రహం తెప్పిస్తోంది. కాగా.. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డికి కేఈ కుటుంబం మొదటి నుంచి సహకరించింది. ఎంపీ టీజీ వెంకటేష్‌పై ఉన్న వ్యతిరేకత కొద్దీ ఎస్వీని ప్రోత్సహించింది. అలాగే పత్తికొండలో తమకు ఎస్వీ తన బంధువైన రామచంద్రారెడ్డి ద్వారా సహకరిస్తారని ఆశించింది. ఇందుకు భిన్నంగా కోట్ల రాకను ఎస్వీ స్వాగతించారు. కర్నూలులో మైనార్టీల్లో కోట్లకు అంతో ఇంతో పట్టుంది.

దీన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వీలుగా ఎస్వీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇన్నాళ్లూ ఉన్న కేఈ సోదరులను కాదని.. వారికి వ్యతిరేక వర్గమైన కోట్ల రాకను స్వాగతించారు. కోట్లతో కలసి సాగితే కర్నూలులో తనకు మైనార్టీ ఓటు బ్యాంకు ఏమైనా కలిసొస్తుందనే ఆలోచనతో ఉన్నారు. అయితే.. ఎమ్మెల్యే ఎస్వీ వైఖరిపై కేఈ వర్గం మండిపడుతోంది. ఒకే దెబ్బకు మూడు పిట్టలు అన్న చందంగా.. కోట్ల సుజాతమ్మను కర్నూలులో పోటీ చేయించే ప్రతిపాదన తెచ్చారు. తద్వారా డోన్‌ టికెట్‌ను తామే దక్కించుకోవడమే కాకుండా.. అటు టీజీ, ఇటు ఎస్వీలను దెబ్బతీయొచ్చన్నది వారి ఆలోచనగా ఉంది. మొత్తంగా అధికార పార్టీలో ఈ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తి రేపుతున్నాయి. 

మరిన్ని వార్తలు