కోట్ల చెప్పిన మాటే నిజం కానుందా?

5 May, 2019 14:38 IST|Sakshi

కాంగ్రెస్‌ పార్టీని వీడితే.. రాజకీయాల నుంచి తప్పుకున్నట్టేనని చెప్పిన కోట్ల

ఇప్పుడు టీడీపీలోకి వచ్చాక.. వెంటాడుతున్న ఓటమి భయం

అంతర్మథనంలో కోట్ల ఫ్యామిలీ

సాక్షి, కర్నూలు : నేను కాంగ్రెస్ పార్టీని వీడటం అంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకున్నట్లే.. ఇవీ ఆయన ఒకప్పుడు కోటలు దాటేలా చెప్పిన మాటలు. అయితే మునిగిపోయే నావలో ఎందుకులే అనుకున్నారో ఏమో... తన ఒట్టు తీసి గట్టుమీద పెట్టి సైకిలెక్కేశారు. ఆ సైకిల్ ప్రయాణమైనా సక్రమంగా సాగిందా అంటే... టైర్లో గాలిలేదు.. ఎదురుగా చూస్తే గతుకుల రోడ్డు అన్నట్టే ఉంది. అవును.. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు అక్షరాలా అదే. గెలుపు ఆశలు లేవు సరికదా.. ఓటమి భయం నిద్రపోనివ్వడం లేదు.
 

ఇది ఫలితాల కాలం.. విద్యార్థులకే కాదు.. రాజకీయ నాయకుల ఫలితాలూ రిలీజయ్యే కాలం ఎంతటి ముదుర్లయినా టెన్షన్ పడే కాలమిది ఎవరు పాస్.. ఎవరు ఫెయిల్ ? విద్యార్థులు ఫెయిలయితే సప్లిమెంటరీ ఉంటుంది. నాయకులు ఫెయిల్ అయితే ఐదేళ్ల తర్వాతే మళ్లీ అందుకే విద్యార్థుల్ని మించి భయపడిపోతున్నారు రాజకీయ నాయకులు కర్నూలు జిల్లాలోని సీనియర్ నాయకుడు కోట్లకూ ఈ టెన్షన్ తప్పడం లేదు.

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఏ పార్టీ అని అడిగితే ఇప్పటికీ టక్కున కాంగ్రెస్ అనే చెప్తారు చాలామంది. తర్వాతే.. అయ్యో టీడీపీలోకి వెళ్లారు కదా అని ముక్తాయిస్తారు. అంతలా కోట్ల కుటుంబం కాంగ్రెస్ పార్టీతో మమేకమైంది. అందుకే.. కాంగ్రెస్ పార్టీని వీడటం అంటే నేను రాజకీయ సన్యాసం చేసినట్లేనని ఓ సందర్భంలో ఆయన ప్రకటించారు. అంతటి కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకుణ్ని తెలుగుదేశంలోకి రప్పించారు చంద్రబాబు నాయుడు. తద్వారా కర్నూలు జిల్లాలో తిరుగులేకుండా వీస్తున్న ఫ్యాన్ గాలిని అడ్డుకోవాలనేది చంద్రబాబు ప్లాన్. అందుకే.. ఎప్పట్నుంచో శత్రు శిబిరాలుగా ఉన్న కేఈ కృష్ణమూర్తి కుటుంబం, కోట్ల కుటుంబాల మధ్య బలవంతంగా రాజీ కుదిర్చారు. రెండు కుటుంబాలు కలిస్తే ఓట్లే ఓట్లు అని చంద్రబాబు లెక్కలేసుకున్నారు. కానీ జనం అందరి లెక్కలూ తేల్చేంత విజ్ఞత కలవారు. రంగులు మార్చే నాయకుల్ని దూరం పెట్టి నమ్మకమైన నాయకత్వానికే జై కొట్టారు. ఫలితంగా కోట్ల కుటుంబానికి రాబోయే ఫలితాలు ఏంటో ఇప్పటికే అర్థమైపోయాయి. దీంతో ఎలక్షన్ మేనేజ్మెంట్‌లో ఎక్కడ ఫెయిలయ్యామబ్బా అని తలపట్టకున్నారు.

చంద్రబాబు చెప్పాడని కలిసినట్లే కనిపించిన కోట్ల, కేఈ వర్గీయుల మధ్య క్షేత్రస్థాయిలో విద్వేషాలు అలాగే ఉన్నాయి. దీంతో పాటు 2014 ఫలితాల్లోనే కర్నూలులో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం కనిపించింది. ఇప్పుడు ఆ జోష్ పెరిగిందేగానీ ఏమాత్రం తగ్గలేదు. దీనికి తోడు.. కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డకి కోడుమూరు, కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని నియోజకవర్గాలు అనుకూలమని చంద్రబాబు భావించారు. కానీ ఆ నియోజకవర్గాలు ఎప్పుడో జగన్ మానియాలోకి వెళ్లిపోయాయి. కోడుమూరులో టీడీపీ నాయకులు కోట్లకు ఏమాత్రం సహకరించలేదనే టాక్ ఉంది. ఎదురూరు విష్ణువర్దన్ రెడ్డి బహిరంగంగానే కోట్లకు ఓటు వెయ్యకండి అని పిలుపునిచ్చినట్లు చెబుతున్నారు.

ఆదోని నియోజకవర్గంలో ఇంతకుముందు కోట్లతోపాటు ఉన్నా కాంగ్రెస్ ముస్లిం మైనార్టీలు అడ్డం తిరిగారు. ఎవరికైనా వెయ్యండి కాని కోట్లకు మాత్రం ఓటెయ్యొద్దంటూ ప్రచారం చేశారు. ఇక కర్నూలు, ఎమ్మిగనూరులో చెప్పక్కర్లేదు. అక్కడంతా జై జగనే.. మొత్తం మీద చూసుకుంటే చాలాచోట్ల కోట్లకు వ్యతిరేక గాలులు వీచాయి. పోలింగ్ సమయంలోపైకి బాగానే ఉన్నట్టు కనిపించిన పరిస్థితి ఆ తర్వాత కొద్దిరోజులకే ఓట్లు పడలేదని అర్థమైపోయింది. ఇప్పుడు కోట్ల ఫ్యామిలి పూర్తిగా అంతర్మథనంలోకి వెళ్లిపోయింది. ఇక, కాంగ్రెస్ పార్టీని వీడితే.. రాజకీయాల నుండి తప్పుకున్నట్లేనని ఒకప్పుడు కోట్ల చెప్పిన మాటలే ఈ ఎన్నికల ఫలితాల తర్వాత నిజమయ్యేలా ఉన్నాయని కర్నూలు ప్రజలు చెప్పుకుంటున్నారు.

మరిన్ని వార్తలు