టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్‌ ముఖ్యనేత

7 Sep, 2018 11:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభను రద్దు చేసిన మర్నాడే టీఆర్‌ఎస్‌ పార్టీ ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’పై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రతిపక్ష పార్టీల్లో బలమైన నాయకులను తమవైపు తిప్పుకునేందుకు కసరత్తు మొదలుపెట్టింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌ కేఆర్‌ సురేశ్‌ రెడ్డిని తమ పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ స్వయంగా తన పార్టీ తాజా మాజీ ఎమ్మెల్యేలతో కలిసి శుక్రవారం సురేశ్‌ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయనను టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానిం​చారు. అనుభవానికి తగ్గ పదవి ఇచ్చి గౌరవిస్తామని చెప్పడంతో టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సురేశ్‌ రెడ్డి అంగీకరించారు. త్వరలోనే చేరిక తేదీని ప్రకటిస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. భేటీ ముగిసిన తర్వాత కేటీఆర్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

సురేశ్‌ రెడ్డి నాలుగు సార్లు నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అయితే బాల్కొండ నుంచి ఆర్మూర్‌ నియోజకవర్గానికి మారి గత రెండు ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయనకు కేసీఆర్‌ ఏం హామీయిచ్చారు, టీఆర్‌ఎస్‌లో ఎటువంటి పదవి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాగా, కాంగ్రెస్‌కు చెందిన మరికొందరు నేతలు కూడా టీఆర్‌ఎస్‌ అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు