ఏపీ వ్యవహారాల్లో తలదూర్చం  

19 Mar, 2019 01:13 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  

అక్కడ మాకు పార్టీ ఆఫీసులు లేవు, పోటీ చేయడంలేదు.. 

ఏపీ ఎన్నికలను టీడీపీ, కేసీఆర్‌ మధ్య పోరుగా చంద్రబాబు చిత్రీకరిస్తున్నారు 

బీజేపీ, కాంగ్రెస్‌ నేతలవి చిచోర విమర్శలు...

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పాత్ర ఏమీ ఉండదని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తారకరామారావు అన్నారు. ఏపీలో అడుగుపెట్టాలన్న ఆలోచనేమీ టీఆర్‌ఎస్‌కు లేదని స్పష్టం చేశారు. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఇమేజ్‌ పాతాళంలో ఉందని ఎద్దేవా చేశారు. వికారాబాద్, భూపాలపల్లి నియోజకవర్గాలకు చెందిన పలువురు ఇతర పార్టీల నేతలు సోమవారం ఇక్కడ తెలంగాణభవ¯Œ లో కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరా రు. ఆయన వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ప్రసంగించారు. అనంతరం మీడియా ప్రతినిధులతోనూ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఏపీ ఎన్నికలను టీడీపీ, కేసీఆర్‌ మధ్య పోరుగా చిత్రీకరించాలని చంద్రబాబు ప్రయత్నించడం చాలా విచిత్రంగా ఉందన్నారు. తెలంగాణ కేంద్రంగా పనిచేస్తున్న టీఆర్‌ఎస్‌కు ఏపీలో ఒక్కచోట కూడా పార్టీ కార్యాలయం లేదని, అక్కడి ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో చేసింది చెప్పుకోలేక తమపై పడి ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. తాము రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చామా? లేదా? అన్నది ఏప్రిల్‌ 11 తర్వాత తెలుస్తుందన్నారు. ‘అప్పుడు మా పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి మారారు. మేమేమీ గొంతు చించుకోలేదు. ఢిల్లీలో రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో ఇతర పార్టీ నేతలు చేరుతున్నారు. కాంగ్రెస్‌ నేతలు మాట్లాడే సమయంలో వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. చేవెళ్ల ఎంపీకి రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ కండువా కప్పారు. అప్పుడు కాంగ్రెస్‌ నీతి ఏమైంది? అన్ని పార్టీల ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ వైపు ఆకర్షితులవుతున్నారు. ఎమ్మెల్యేలు పార్టీ లు మారడం కొత్తకాదు’అని కేటీఆర్‌ అన్నారు. 

కొన్ని రాష్ట్రాలకే పరిమితం
కాంగ్రెస్, బీజేపీలు కలిసినా అధికారానికి సరిపడా సీట్లు తెచ్చుకోలేవని, జాతీయ పార్టీలు కొన్ని రాష్ట్రాలకే పరిమితమయ్యాయని కేటీఆర్‌ పేర్కొన్నారు. ‘టీఆర్‌ఎస్‌ ఉద్యమకారులకు పదవులు ఇచ్చి గౌరవించింది. టీఆర్‌ఎస్‌కు వచ్చే సీట్లు జాతీయ పార్టీల కంటే ఎక్కువగా ఉంటాయి. టీఆర్‌ఎస్‌ నుంచి లోక్‌సభ అభ్యర్థులు ఎవరన్నది ముఖ్యం కాదు. అన్ని నియోజకవర్గాలకు కేసీఆరే అభ్యర్థి. ఢిల్లీ రాజకీయాల్లో ఎలా స్పందించాలో కేసీఆర్‌కు తెలుసు. లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిపోతుంది. రాజకీయాల నుంచి చంద్రబాబుకు వీడ్కోలు పలికేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.  జగన్‌ ఫ్యాన్‌కు స్విచ్‌ ఎక్కడుందో చెప్పే బాబుకు... టీడీపీ సైకిల్‌కు గాలి ఎవరు కొడుతున్నారో అక్కడి ప్రజలు తేల్చి చెబుతారు. చంద్రబాబు చాలా అహంభావంతో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు కింద ఎవరూ పనిచేయరు. చంద్రబాబు... ఎన్టీఆర్‌ కంటే ఎక్కువగా కేసీఆర్‌ను తలుచుకుంటున్నారు. బాబుకు దమ్ముంటే మళ్లీ మోదీతో కలవనని చెప్పాలి’అని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. 

ప్రజల అవసరాలే ఎజెండా... 
‘భవిష్యత్తులో అవసరమైతే జాతీయ పార్టీ పెడతామని కేసీఆర్‌ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ అంటే పడని పార్టీలు చాలా ఉన్నాయి. అందుకే బీజేపీ, కాంగ్రెస్సేతర పార్టీలను కూడగడతాం. ప్రజలకు ఏది అవసరమో దానినే ఎజెండాగా పెట్టుకొని ముందుకు వెళతాం. దేశవ్యాప్తంగా ఉన్న పలువురు మేధావులతో కేసీఆర్‌ సంప్రదింపులు చేస్తున్నారు’అని చెప్పారు. సికింద్రాబాద్‌ మినహా అన్ని పార్లమెంటు సీట్లలో సీఎం కేసీఆర్‌ బహిరంగసభలు ఉండొచ్చన్నారు. ‘అభ్యర్థుల విషయంలో కేసీఆర్‌ ఆచితూచి నిర్ణ యం తీసుకుంటారు. రేవంత్‌రెడ్డి అంత పెద్ద నాయకుడు కాదు. పేపర్, ఫ్లెక్సీ పులి. కేసీఆర్‌ ను తిడితే నాయకుడు కాలేడు. పవన్‌ కల్యాణ్‌ సికింద్రాబాద్, మల్కాజిగిరిలో ప్రచారం చేసుకోవచ్చు’అని కేటీఆర్‌ అన్నారు.

ఏది కరెక్టో ప్రజలు నిర్ణయిస్తారు... 
‘ఎమ్మెల్యేలు పార్టీ మారడాన్ని తప్పు పడుతున్న పార్టీలు లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ప్రామాణికంగా తీసుకుంటే మంచిది. ఏది తప్పు, ఏది కరెక్టు అనేది ప్రజలు ఏప్రిల్‌ 11న నిర్ణయిస్తారు. కేసీఆర్‌ రైతుబంధు పెట్టినట్లు ప్రధాని మోదీకి, విపక్ష నేత రాహుల్‌కు అలాంటి ఆలోచనలు ఎందుకు రాలేదు? టీఆర్‌ఎస్‌ పదహారు ఎంపీ సీట్లు ఎందుకు గెలవాలో సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌సభలో విడమరిచి చెప్పారు’అని కేటీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు కేసీఆర్‌ గురించి హేళనగా మాట్లాడినవారే... ఇప్పుడు 16 ఎంపీ సీట్లు గెలిపించాలని కోరితే హేళనగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘రెండు ఎంపీ సీట్లతోనే కేసీఆర్‌ తెలంగాణ సాధించారు. కేసీఆర్‌కు 16 ఎంపీ సీట్లు ఇస్తే తెలంగాణకు కావాల్సినవి తన్నుకుంటూ రావా? కేసీఆర్‌ లేవనెత్తిన జాతీయ మౌలికాంశాలపై కాంగ్రెస్, బీజేపీ నేతలు నోరు మెదపకుండా వ్యక్తిగత, చిచోర విమర్శలకు దిగుతున్నార’ని దుయ్యబట్టారు.

మరిన్ని వార్తలు